ఆ ఆస్టరాయిడ్.. భూమిని ఢీకొంటుందా?

ఈ విశ్వంలో జరిగే అనేక పరిణామాల కారణంగా అప్పుడప్పుడూ భూమికి ముప్పు వాటిల్లుతున్న సంకేతాలు వెలువడుతుంటాయి. 2012 టైంలో యుగాంతానికి దగ్గర పడ్డామని.. భూమి అంతరించబోతోందని జరిగిన ప్రచారంతో జనాలు కంగారెత్తిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.

అలాగే ఏవేవో శకలాలు, ఆస్టరాయిడ్లు భూమి మీదికి దూసుకొస్తున్నాయని కూడా ప్రచారం జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో శాస్త్రవేత్తలు ఆ ముప్పును తప్పించడానికి ఏం చేయాలో అది చేస్తారు. స్వల్ప నష్టాలు మిగిల్చే పరిణామాలు జరిగేట్లయితే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తారు.

ఐతే ఒక భారీ ఆస్టరాయిడ్ ఈ నెల నాలుగో తారీఖున (గురువారం) భూమిని ఢీకొట్టబోతోందంటూ కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అది ఏ సమయంలో ఎక్కడ ఏ ప్రాంతాన్ని ఢీకొడుతుందనే స్పష్టత లేదు.

ఐతే నాసా ఈ ఆస్టరాయిడ్‌ను జాగ్రత్తగా గమనిస్తోంది. ఆ ఆస్టరాయిడ్ వల్ల అనుకున్నంత ప్రమాదం ఏమీ లేదని ఆ సంస్థ సమాచారం ఇచ్చింది. 52 అడుగుల ఎత్తుతో ఒక ఇంటి సైజులో ఉండే ఆస్టరాయిడ్ అట ఇది. ఇలాంటి ఆస్టరాయిడ్లతో భూమికి ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది కాబట్టి శాస్త్రవేత్తలు వాటి గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు.

ఇప్పుడు భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్న ఆస్టరాయిడ్ సైజు కాస్త పెద్దదే. ఐతే ఈ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమి దిశగానే సాగుతున్నప్పటికీ.. అది కొంచెం చేరువగా వచ్చి వెళ్లిపోతుందని.. దాంతో వచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆస్టరాయిడ్ గమనం మారి.. ఏదైనా ముప్పు వాటిల్లేలా ఉంటే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తామని నాసా స్పష్టం చేసింది. కాబట్టి దీని విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేనట్లే.