సంచలన తీర్పును వెల్లడించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కలిసి జీవించే పరిస్థితులు లేనప్పుడు విడిపోవాలని దంపతులు ఇద్దరు పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నప్పుడు.. విడాకుల కోసం ఆర్నెల్లు ఆగాల్సిన అవసరం లేదని.. వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని చెప్పింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే అందుకు ఆరు నెలలు ఎందుకు ఆగాలి? కొన్ని షరతులతో ఆరునెలల నిరీక్షణ నిబంధనను పాటించకుండా తక్షణమే విడాకులు మంజూరు చేసే విశిష్ఠ అధికారం తమకు ఉందన్న విషయాన్ని సుప్రీం స్పష్టం చేసింది.
భార్యభర్తల మధ్య వివాహ బంధం కోలుకోలేని రీతిలో విచ్ఛిన్నమైన తర్వాత ఆ కారణంగా వారిమధ్య పెళ్లిని రద్దు చేసి విడాకులు మంజూరు చేయటం కోర్టుకు సాధ్యమేనని.. ఇందుకు ఆర్టికల్ 142 కింద విస్త్రత అధికారాల్ని ఉపయోగించుకోవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ కే కౌల్ నేత్రత్వంలోని ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పును ఇచ్చింది.
ఫ్యామిలీ కోర్టుకు రిఫర్ చేయకుండానే సుప్రీం నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లుదాఖలైన నేపథ్యంలో.. వాటిని విచారించిన కోర్టు ఇరు వర్గాల వాదనల్ని విన్నది. దాదాపు ఏడేళ్లుగా సాగున్న వాదనల్ని విన్న సుప్రీం కోర్టు గత సెప్టెంబరులో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా తీర్పును వెల్లడించిననేపథ్యంలో పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు కోరుకునే వారికి తక్షణమే ఇచ్చేయాలన్న విషయాన్ని తన తీర్పుతో స్పష్టం చేసింది.దానికి కోర్టులకు అధికారం ఉందని పేర్కొంది.
సుప్రీం తాజా తీర్పుతో ఫ్యామిలీ కోర్టుల్లో ఫాస్ట్ ట్రాక్ విడాకులకు తెర తీసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(బి) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకులు కోరవచ్చు. అయితే.. దీనికి ఫ్యామిలీ కోర్టుల్లో విడాకులకు సుదీర్ఘ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఆర్టికల్ 142 ఉపయోగించి.. వెంటనే విడాకులు మంజూరు చేసేందుకువీలుగా సుప్రీం తీర్పును ఇచ్చింది.
ఆర్టికల్ 142 అన్నది ప్రాథమిక హక్కులకు వెలుగు రేఖ లాంటిదన్న సుప్రీం.. పూర్తిస్థాయి న్యాయం.. అది కూడా ఎలాంటి వాయిదాలు వేయకుండా ఈ కోర్టు (సుప్రీం తనను తాను ఉద్దేశించి) అందిస్తున్న వ్యాఖ్య చేసింది. అంతేకాదు భరణం చెల్లింపు.. పిల్లల హక్కులకు సంబంధించిన ఈక్విటీలనుఎలా బ్యాలెన్సు చేసుకోవాలో బెంచ్ పేర్కొంది. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులకు సుప్రీం తాజాగా వెలువరించిన తీర్పు కొత్త అడుగుకు నాందిగా అభిప్రాయపడుతున్నారు.