ఎట్టకేలకు ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2020 సీజన్‌పై పూర్తి స్పష్టత వచ్చేసింది. దేశంలో కొన్ని నెలలుగా కరోనా విలయ తాండవం చేస్తుండటం.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడేలా లేకపోవడంతో ఈ ఏడాదికి ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశం లేదని తేలిపోగా.. యూఏఈ వేదికగా లీగ్‌ను నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే ఇందుకు భారత ప్రభుత్వం అనుమతి కోసం బోర్డు ఎదురు చూస్తూ ఉంది. వారి ఎదురు చూపులు ఫలించాయి. ఆదివారం లీగ్ నిర్వహణపై ఐపీఎల్ పాలకమండలి సమావేశం అయిన రోజే ప్రభుత్వం యూఏఈలో లీగ్ నిర్వహణకు పచ్చజెండా ఊపడం విశేషం. ఈ తీపి కబురు అందుకున్న ఐపీఎల్ పాలకమండలి ఉత్సాహంగా ఐపీఎల్ ఆరంభ, ముగింపు డేట్లు, ఇతర విశేషాలు వెల్లడించింది.
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకూ ఐపీఎల్ నిర్వహించనున్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా… ఈ మూడు వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఎప్పుడూ ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం పూట అయితే 4 గంటలకు రాత్రి పూట అయితే 8 గంటలకు ఆరంభమవుతాయి కానీ.. ఈసారి యూఏఈలో మాత్రం ప్రతి మ్యాచ్ రాత్రి ఏడున్నరకే ఆరంభమవుతుంది.
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను సోమవారం వెల్లడించనున్నారు. ఐపీఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు.. 2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. కరోనా ముప్పు నేపథ్యంలో యూఏఈలో కూడా ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్ తరహాలోనే బయో సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహించబోతున్నారు.