పెళ్లైన గంటకే విడాకులు.. తమ్ముడితో పెళ్లి చేసిన అన్న

అప్పుడే పెళ్లైంది. కానీ.. పెళ్లైన గంటకే కట్టుకున్న పెళ్లానికి విడాకులు ఇచ్చేసిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ విచిత్రం ఇక్కడితో ఆగిపోలేదు. మరింత సాగింది. పెళ్లి చేసుకున్న భార్యకు గంట తిరిగేసరికి విడాకులు ఇచ్చేయటమే కాదు.. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఎందుకిలా? ఎలా సాధ్యమైందన్న విషయాల్లోకి వెళితే

యూపీలోని సంభాల్ జిల్లాలో ఈ విచిత్ర ఘటనకు వేదికైంది. జిల్లాలోని సైద్ నగలి అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. భార్య.. భర్తల మధ్య పంచాయితీలు.. గొడవలు సాగేవి. దీంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఎవరి దారి వారిది అన్నట్లు బతికేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి ఊళ్లో మరో యువతితో పరిచయం కావటం.. వారి మధ్య లంకె కుదిరింది.

దీంతో వీరి వ్యవహారం పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లే రెండు రోజుల క్రితం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా పెళ్లి అయ్యిందో లేదో మహా డ్రామాకు తెర లేచింది. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య పెళ్లి మండపానికి వచ్చింది. తాను బతికే ఉన్నానని.. అలంటప్పుడు తన భర్త వేరే వారితో ఎలా పెళ్లి చేసుకుంటారన్న లా పాయింట్ తీసింది.

కోపంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య మళ్లీ తిరిగి రాదన్న భావనతో ఉన్న పెళ్లి కొడుక్కి ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అనుకోని రీతిలో భార్య ఎంట్రీ ఇవ్వటం.. పోలీసు కేసు పెడతానని బెదిరించటంతో.. విషయం మరీ రచ్చ కాకుండా ఉండటానికి వీలు లేకుండా ఊళ్లోనే పంచాయితీ పెట్టారు. చివరకు విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

పెళ్లి చేసుకున్న జంట విడాకులు తీసుకోవాలని డిసైడ్ చేయటమే కాదు.. రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లికొడుకు తమ్ముడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో.. ఈ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ విచిత్రమైన తీర్పు యవ్వారం సోషల్ మీడియాలో పోస్టుగా రావటంతో విషయం బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. యూపీలోని ఊళ్ల పంచాయితీలు ఏ రీతిలో ఉంటాయన్న దానికి తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు.