మనోజ్ హరిజీవన్ దాస్ మోడీ పేరు విన్నారా? నో.. అనే చెబుతారు. సరే.. మనోజ్ మోడీ విన్నారా? అవునని చెప్పేటోళ్లు చాలా తక్కువమందే కనిపిస్తారు. అది కూడా బిజినెస్ వార్తలు బాగా ఫాలో అయ్యేవారు.. ఎకనామిక్స్ టైమ్స్.. ఫైనాన్షియల్ టైమ్స్ తో పాటు.. బిజినెస్ ఛానల్స్ ను అదే పనిగా ఫాలో అయ్యే వారికి ఆయన పరిచయమే.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితంగా.. ఆయన తీసుకునే కీలక నిర్ణయాల వెనుక ఉండే వ్యక్తి మనోజ్ మోడీ. ఆయనతో మీటింగ్ జరిగి.. పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారంటే దాదాపుగా పని పూర్తి అయినట్లే.
అంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు.. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగాలి కదా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఆయన చాలా లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఆయనఅసలు కనిపించరు. ముకేశ్ అంబానీకి.. వారి కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా ఉండటమే కాదు.. పని పట్ల పూర్తిస్థాయి కమిట్ మెంట్..కంపెనీ ప్రయోజనాలు మినహా మరేమీ పట్టని వ్యక్తిగా ఆయనకు పేరుంది.
తనకున్న బలాల్ని సైతం.. బలహీనతలుగా చెప్పుకొని తప్పించుకోవటమే కాదు..తానేమీ చేయలేనని.. చాలా మామూలు ఉద్యోగి అన్నట్లు మాట్లాడతారు కానీ.. ఆయన మేధస్సు.. అంబాని మాస్టర్ మైండ్ కు కీలకమైన చిప్ గా చెప్పాలి. రిలయన్స్ ఓకే చేసే చాలా డీల్స్ ఆయన మెదడులో నుంచి పుట్టినవే. బిగ్ బాస్ మైండ్ కు ఏదైనా అనిపిస్తే.. దాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటం కోసం ఎంతవరకైనా వెళ్లే వ్యక్తిగా చెబుతారు.
ఈ రోజున చూస్తున్న జియో కానీ.. ఇటీవల పలు కీలక సంస్థలతో డీల్ ఓకే చేయటం వెనుక ఆయనే కనిపిస్తారు. రిలయన్స్ లో దాదాపు ముప్ఫై ఏళ్ల ప్రయాణం ఆయనిది. ధీరుభాయ్ అంబానీ పెట్రోలియం సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన సమయం నుంచి కంపెనీలో ఉన్న వ్యక్తుల్లో మనోజ్ ఒకరు.
ది యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ముకేశ్ అంబానీతో మనోజ్ కు పరిచయం ఉంది. అలా రిలయన్స్ లో అడుగు పెట్టిన ఆయన.. అప్పట్లో ధీరూభాయ్ తోనే కాదు.. తర్వాతి కాలంలో ముఖేశ్ తో.. ఇషాతో.. ఇప్పుడు నీతాతోనూ కలిసి పని చేస్తున్నారు.
రిలయన్స్ జియో విస్తరణ సమయంలో ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఫైబర్ ఆప్టికల్ కేబుల్ విస్తరణ వేళలో సరఫరాదారులతో తీరికలేకుండా చర్చలు జరిపిన ఫలితమే ఈ రోజున జియోలో 400 మిలియన్ల వినియోగదారులు ఉన్నారని చెప్పాలి. కరోనావేళలో రిలయన్స్ ప్రధాన వ్యాపారమైన పెట్రోలియం రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న పరిస్థితి.
ఇలాంటి వేళలో.. చాలామంది దాని బారిన పడతారు. అందుకుభిన్నంగా జియోలోని వాటాల్ని వ్యూహాత్మకంగా అమ్మటం ద్వారా కంపెనీ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లటంలో కీలక భూమిక పోషించారు. దీంతో.. కంపెనీ షేర్లకు మార్కెట్ విలువ పెరగటంతో పాటు.. రిలయన్స్ డిజిటల్ వ్యాపారం రానున్న రోజుల్లో తిరుగులేని స్థానానికి చేరుకోవటానికి వీలుగా దారులు ఓపెన్ అయ్యాయని చెప్పాలి.
తమ కంపెనికి సరిపోయే వాటితో భాగస్వామ్యం నెరపటంలో ఆయనది అందెవేసిన చేయి. బేరాలు ఆడటంలో ఆయనకు మించినోళ్లు లేరనే చెబుతారు. రిలయన్స్ కొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ నుంచి చాలా స్టార్టప్ లను కొనుగోళ్లలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్ ను విస్తరణలో ఆయన పాత్ర చాలానే ఉంది.
తనకు బేరాలు ఆడటం రాదని.. వ్యూహాలు అర్థం కావని.. ముందు చూపుకూడా తక్కువని చెప్పే ఆయన మాటలు విన్నప్పుడు సింఫుల్ గా కనిపించే ఆయన.. నోటి నుంచి వచ్చే మాటలకు.. చేతలతో చేసే పనులకు ఏ మాత్రం లింకు ఉండదని చెప్పక తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే రిలయన్స్ కు ముఖేశ్ మదర్ బోర్డు అయితే.. మనోజ్ అందులో కీలకమైన చిప్ గా చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates