షాకిస్తున్న ఐటీ కంపెనీలు

నిరుద్యోగులకు, ఉద్యోగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఫ్రెషర్లకు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. చేసుకున్న రిక్రూట్మెంట్లను వాపసు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతుందని అనుకుంటున్న ఆర్థిక మాంద్యం భయమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, క్యాంపస్ సెలక్షన్ అన్నింటినీ కంపెనీలు రద్దు చేసుకుంటున్నాయి. దాంతో ఉద్యోగాలకు ఎంపికయ్యామని సంతోషంగా ఉన్న వాళ్ళందరికీ తీవ్ర నిరాశ తప్పటం లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లు ఐటీ కంపెనీలు పెద్దగా రిక్రూట్మెంట్ చేయలేదు. ఎంతో అవసరమైన పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నాయి. ఇదే సమయంలో వివిధ కారణాలతో వేలాదిమంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేశారు. దాంతో మళ్ళీ ఆ ఉద్యోగాలను భర్తీ చేసుకోవాల్సిన అవసరం కంపెనీలపై పడింది. దానికి అదనంగా కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించి భారీ ఎత్తున రిక్రూట్మెంట్లకు దిగాయి.

డైరెక్టుగాను, క్యాంపస్ సెలక్షన్ల పేరుతో విప్రో, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్ కంపెనీలు వేలాదిమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ ఎంపికైన వారికి ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయి. అయితే హఠాత్తుగా తామిచ్చిన ఆఫర్ లెటర్లను వాపసు తీసుకుంటు ఎంపికైన ఉద్యోగులందరికీ ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇస్తున్నాయట. కంపెనీల ఎకడమిక్ ఎలిజిబులిటీ నిబంధనలకు తగ్గట్లుగా లేని కారణంగా ఆపర్ లెటర్లను వాపసుతీసుకుంటున్నట్లు ఈమెయిళ్ళల్లో కంపెనీలు చెబుతున్నాయట.

నిజానికి ఎంపికలన్నీ అనేక దశల ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్ల నిర్వహణ తర్వాతే జరిగాయి. అప్పట్లో గుర్తుకురాని ఎకడమిక్ ఎలిజిబులిటి నిబంధనలు ఆఫర్లు లెటర్లు ఇచ్చిన మూడు, నాలుగు నెలల తర్వాత గుర్తుకురావటమే ఆశ్చర్యంగా ఉంది. కంపెనీల వైఖరిపై ఉద్యోగాలు చేజారిపోయిన వారంతా మండిపడుతున్నారు. దీనికి ప్రదాన కారణం ఏమిటంటే తొందరలోనే ప్రపంచ ఆర్ధిక మాంద్యం రాబోతోందనే సూచనలే కారణమని తెలుస్తోంది. ఇదే విషయమై అమెరికాలోని చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నాయట. మన కంపెనీలు కూడా అదే బాటలో నడవాలని డిసైడ్ అవటంతోనే ఆఫర్ లెటర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం.