దృశ్యం సినిమా క్రైమ్ నిజం చేశారుగా !

‘దృశ్యం’ సినిమా చూసే వుంటారు క‌దా! ఈ సినిమాలో హీరో.. త‌న కుమార్తె స్నానం చేస్తుండ‌గా.. ఓ యువ కుడు మొబైల్‌లో చిత్రీక‌రించాడ‌ని తెలిసి.. ఆ యువ‌కుడిని యువ‌తి, త‌ల్లి క‌లిసి చంపేయ‌డం.. త‌ర్వాత‌..దాన్ని.. క‌ప్పిపుచ్చు కునేందుకు వ్యూహాత్మ‌కంగా ర‌క్తిక‌ట్టించ‌డం.. తెలిసిందే. ఇప్పుడు సేమ్ అలానే జ‌రిగింది. అయితే.. ఈ కేసులో యువ‌తి, ఆమె త‌ల్లి క‌లిసి.. తండ్రిని క‌డ‌తేర్చారు. మిగిలిందంతా సేమ్ సీన్‌.

ఏం జ‌రిగిందంటే..

క‌ర్ణాట‌క‌లోని బెళగావికి చెందిన భూవ్యాపారి సుధీర్‌ కాంబళె గతంలో దుబాయ్‌లో పని చేసేవాడు. కరోనా సమయంలో బెళగావిలోని క్యాంప్‌ ఏరియాలో ఉంటూ భూవ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాడు. సుధీర్‌, రోహిణిల కుమార్తె స్నేహ. మహారాష్ట్రలోని పుణెలో ఒక కళాశాలలో హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు ఆమెకు అక్షయ్‌ విఠకర్‌ పరిచయమయ్యాడు. వారి ప్రేమ విషయాన్ని సుధీర్‌ ఇటీవల గుర్తించి కుమార్తెను మందలించాడు. దీంతో తండ్రి అడ్డు తప్పించాలని ఆమె భావించి విషయాన్ని తల్లికి చెప్పగా.. హత్యను ఆమె ప్రోత్సహించింది.

తన ప్రియుడ్ని పుణె నుంచి బెళగావికి సెప్టెంబరు 15న పిలిపించిన స్నేహ.. పథకం ప్రకారం ఓ లాడ్జిలో ఉంచింది. తండ్రి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్నప్పుడు 17న ఉదయం అక్షయ్‌ను తల్లీబిడ్డలు ఇంటికి పిలిపించారు. సుధీర్‌ కాళ్లు చేతులను వారిద్దరూ పట్టుకోగా.. ఆయన కడుపు, గొంతు, చేతులు, మొహంపై ఓ కత్తితో అక్షయ్‌ ఇష్టానుసారం పొడిచాడు. సుధీర్‌ మరణించారని ధ్రువీకరించుకున్నాక అక్షయ్‌ పుణెకు వెళ్లిపోయాడు.

తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యారని రోహిణి ఇచ్చిన ఫిర్యాదుతో డీసీపీ రవీంద్ర దర్యాప్తు చేపట్టా రు. విచారణలో ఎలా అడిగినా.. వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలిచ్చారు. అనుమానంపై తల్లీకుమార్తెల ఫోన్‌కాల్స్‌ను పోలీసులు పరిశీలించారు. స్నేహ క్రమం తప్పకుండా అక్షయ్‌తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆపై విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హత్యను ప్రోత్సహించిన ఆమె తల్లి అయిన రోహిణి కాంబళె, ఆమె ప్రియుడు అక్షయ విఠకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య తామే చేశామని ఒప్పుకున్నారు.

కొస‌మెరుపు ఏంటంటే.. ఈ నిందితులు అంద‌రూ.. కూడా ‘దృశ్యం’ సినిమాను ముగ్గురు పదిసార్లు చూసినట్లు విచారణలో తెలిపారు.