ఇటు టిక్ టాక్ బ్యాన్‌.. అటు చైనా కంపెనీల‌తో భారీ డీల్‌

Adani

చైనాకు ఆదాయం తెచ్చి పెట్ట‌డంతో పాటు మ‌న డేటాను ఆ దేశానికి అందిస్తున్నాయ‌న్న అనుమానాల‌తో ఒకేసారి 59 చైనా యాప్‌ల‌ను నిషేధించింది కేంద్ర ప్ర‌భుత్వం. దీనిపై నిన్న‌ట్నుంచి పెద్ద ఎత్తునే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

యాప్‌ల‌ను అయితే సులువుగానే నిషేధించేశారు.. మ‌రి చైనా ఉత్ప‌త్తుల వినియోగం మాటేంటి అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. దేశంలో చైనా కంపెనీలు వేలు, ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు పెట్టాయి. ఆ దేశానికి చెందిన ఎన్నో ఉత్ప‌త్తులు వాడుతున్నాం.. మ‌రి వాటిని నియంత్రించ‌డం ఎలా అని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు.

ఐతే దేశంలోకి చైనా పెట్టుబ‌డుల రాక ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కూడా ఏమీ ఆగ‌లేదు. చైనా యాప్స్‌ను నిషేధించ‌డానికి వారం కింద‌ట ఒక ప్ర‌ముఖ కంపెనీలోకి చైనా ఫిర్మ్ నుంచి భారీ పెట్టుబ‌డులు వ‌చ్చాయి. భార‌త వ్యాపార దిగ్గ‌జాల్లో ఒక‌రైనా అదానికి చెందిన గ్రూప్‌లోకి చైనా ఫిర్మ్ ఒక‌టి ఏకంగా 300 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబడులు పెట్టింది.

చైనా యాప్స్‌ను నిషేధించ‌డం గురించి ఓ వైపు చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. కేంద్రం ఆ నిర్ణ‌యాన్ని స‌మీక్షిస్తుండ‌గానే ఈ డీల్ జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌తలు న‌డుస్తున్న స‌మ‌యంలో వేచి చూసే ధోర‌ణి లేకుండా ఇటు అదాని గ్రూప్ పెట్టుబ‌డుల‌కు ఆహ్వానం ప‌ల‌క‌డం, చైనా ఫిర్మ్ ఆ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఇలా మ‌రెన్నో కంపెనీలు భారత్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు పెట్టాయి. ఇక ముందూ అవి ఆగే ప‌రిస్థితి ఏమీ క‌నిపించ‌డం లేదు. మోడీ స‌ర్కారు 2014లో అధికారంలోకి వ‌చ్చాక దేశంలో చైనా పెట్టుబ‌డులు 500 శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం.