అగ్నిపథ్ కు కార్పొరేట్ల మద్దతు

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి ఒకవైపు అభ్యర్థులు, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే, వ్యతిరేకిస్తుంటే మరోవైపు కార్పొరేట్ ప్రపంచం మద్దతిస్తోంది. అగ్నిపథ్ పథకాన్ని కార్పొరేట్ సంస్ధలు స్వాగతిస్తున్నాయి. అగ్నిపథ్ పథకంలో సైన్యంలోకి ప్రవేశించి, శిక్షణ తీసుకుని నాలుగేళ్ళ సర్వీసు తర్వాత రిటైర్ అయిన వారిని కార్పొరేట్ సంస్ధల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వివిధ సంస్ధల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి.

మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, ఆర్పీజీ గ్రూపు ఛైర్మన్ హర్ష్ గోయెంక, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ లు అగ్నివీరులను తమ కంపెనీల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా తమ కంపెనీల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చో కూడా వీరు వివరించటం కేంద్ర ప్రభుత్వానికి నైతిక మద్దతుగా నిలిచేదే.

సుశిక్షితులైన, సమర్ధులైన యువత కంపెనీల్లో ఉద్యోగాలకు చాలా అవసరమని వీళ్ళు చెప్పారు. అగ్నిపథ్ పథకం ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం కార్పొరేట్లకు ఒకేసారి రావడం చాలా అరుదుగా జరుగుతుందని ఆనంద్ మహీంద్ర అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణ, సుశిక్షితులైన యువత కార్పొరేట్ ప్రపంచానికి చాలా అవసరంగా హర్ష్ గోయెంకా చెప్పారు. అపోలో హాస్పిటల్స్, టీవీఎస్ మోటార్స్, టాటా గ్రూప్ లాంటి అనేక కార్పొరేట్ కంపెనీలు కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే సమాజంలో స్పష్టమైన విభజన జరగబోతున్నట్లు అనుమానంగా ఉంది. కేంద్రం తన నిర్ణయానికి మద్దతుగా కార్పొరేట్ కంపెనీలను రంగం మీదకు తెచ్చినట్లే అనుమానంగా ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు, అభ్యర్థులు, రక్షణదళంలో పనిచేసి రిటైర్ అయిన వారిలో కొందరు అగ్ని పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్ని వీరులకు ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు కేంద్రం చెబుతోంది. అయితే దేశంలో పోయిన సంవత్సరం జూన్ నాటికి 27 లక్షలమంది రిటైర్డ్ ఉద్యోగులున్నారు. అయితే వీరి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య చాలా తక్కువ. అలాగే బ్యాంకుల్లో రుణాలూ రాలేదు. ఇలాంటి అనేక కారణాల వల్లే ప్రతిపక్షాలు ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.