అవిభక్త కవలల గురించి ఎప్పుడు చర్చ జరిగినా తెలుగు రాష్ట్రాల వారికి వీణ-వాణిలే గుర్తుకు వస్తారు. నల్గొండ జిల్లాకు చెందిన పేద కుటుంబంలో జన్మించిన ఈ కవలలు తలలు కలిసిపోయి పుట్టారు. వారి తలల్ని వేరు చేయడం గురించి ఎన్నోసార్లు చర్చ జరిగింది. సర్జరీపై ఎటూ తేల్చలేక వైద్యులు ఆగిపోయారు. తలలు వేరు చేసే ప్రయత్నం చేస్తే వీరి ప్రాణాలు నిలవకపోవచ్చన్న భయం సర్జరీకి వెళ్లనివ్వలేదు. చూస్తుండగానే వీరు పెరిగి పెద్దవాళ్లయిపోయారు.
ఇప్పుడు ఇద్దరూ 18వ పడిలో ఉండటం గమనార్హం. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో, ప్రభుత్వ ఖర్చుతో వీరు పెరిగి పెద్దవుతున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లతో ఓ గది ఉంది. ఇలా తలలు కలిసి ఉంటూనే ఇద్దరూ వేర్వేరుగా చదువుకోవడం విశేషం. ఈ ఏడాదే ఇద్దరూ పదో తరగతి పరీక్షలు కూడా రాశారు.
కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు అర్ధంతరంగా ఆగిపోవడం, ఆ తర్వాత పరీక్షల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ ఏడాది అందరినీ ఒకేసారి పాస్ చేసేసిన సంగతి తెలిసిందే. ఐతే అప్పటికే పూర్తయిన పరీక్షల మార్కులు.. ఇంటర్నల్ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా వీరికి గ్రేడింగ్ ఇచ్చారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ స్కోర్ సాధించారు.
మార్చిలో జరిగిన మొదటి మూడు పరీక్షలకు వీణ వాణి హాజరయ్యారు. మధురానగర్‌లోని ప్రతిభ హైస్కూల్‌లో వేర్వేరు హాల్ టికెట్లతో పరీక్షలు రాశారు. వీణ వాణిని ప్రత్యేక వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఇంటర్‌లో చేరేందుకు వీరిద్దరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్) చదవాలనుకుంటున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలు చేయాలని వీణ-వాణి ఆసక్తి చూపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates