కరోనా దారుణాలకు ఇదొక నిదర్శనం

కరోనా తెచ్చిన కష్ట నష్టాల గురించి చెప్పుకుంటే పోతే ఒక్కొక్కరు ఒక్కో పుస్తకం రాసేయొచ్చేమో. ప్రపంచంలో 80 శాతం మంది దాకా ఈ వైరస్ వల్ల ప్రభావితం అయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాలుగా నష్టాలు చవిచూశారు. చూస్తున్నారు. చూడబోతున్నారు. ఈ వైరస్ వల్ల దెబ్బ తినని రంగం లేదు. మిగతావన్నీ మూతబడ్డా ఆసుపత్రులైనా లాక్ డౌన్ సమయంలో నడిచాయా, ఆ రంగం అయినా లాభపడిందా అంటే అదీ లేదు.

లాక్ డౌన్ టైంలో ఆసుపత్రులు కూడా చాలా వరకు మూతపడ్డాయి. అత్యవసర సేవలు కూడా ఆగిపోయాయి. జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఓ మోస్తరు సమస్యలైతే ఆసుపత్రులకు వెళ్లాల్సిన పని లేదు. వైద్యం వాయిదా వేసుకోవచ్చు. కానీ అత్యవసర సేవలు కూడా దూరమైతే జనాలు ఏం కావాలి? గత పది వారాల్లో ఇండియాలో ఇలా ఎన్నో వేలు, లక్షల మంది అవస్థలు ఎదుర్కొన్నారు.

సాధారణంగా ఒక వారంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు పొందే సేవలతో పోలిస్తే.. గత పది వారాల్లో 36 శాతం మాత్రమే సేవలు అందుకున్నారట. 64 శాతం మంది చికిత్సకు దూరమయ్యారట. ఆసుపత్రులు మూతపడి ఉండొచ్చు. లేదా వైద్యులు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. లేదా ఆసుపత్రులకు వెళ్లే అవకాశం లేకపోయి ఉండొచ్చు.

మూడింటి రెండొంతుల మంది క్యాన్సర్ చికిత్స అందుకోలేకపోయారు. వాళ్లలో ఎంతోమంది పరిస్థితి విషమించి ఉండొచ్చు. ఎన్నో ప్రాణాలు కూడా పోయి ఉండొచ్చు. ఆ లెక్కలు దేవుడికే ఎరుక. ఇలా అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన ఎంతోమంది లాక్ ‌డౌన్‌లో వాటికి దూరమయ్యారు. ఆసుపత్రుల్లో పిల్లల జననాల్లో కూడా 26 శాతం కోత పడింది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఎప్పుడూ ఆసుపత్రుల్లో జరిగే జననాల్లో నాలుగింట మూడొంతులే జరిగాయట. మరి మిగతా జననాల పరిస్థితేంటి? డెలివరీ అంటే కచ్చితంగా ఆసుపత్రుల్లో జరగాల్సిందే కదా? అవి ఎలా తగ్గాయి? దీని వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో? ఎందరికి ప్రాణాల మీదికి వచ్చిందో?