మైక్రోసాఫ్ట్.. గూగుల్.. మాత్రమే కాదు ఏకంగా 13 దిగ్గజ కంపెనీలకు ప్రవాస భారతీయులే సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా జాబితాలో మరో పేరు చేరనుంది. కేరళకు చెందిన రాజ్ సుబ్రహ్మణ్యంను ప్రఖ్యాత డెలివరీ సంస్థ ఫెడెక్స్ సీఈవోగా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ స్థానంలో ఆయన ఎంపిక జరగటం విశేషం. జూన్ ఒకటి నుంచి మనోడి సారథ్యంలో ఫెడెక్స్ నడవనుంది. ఇప్పటికే ఆ కంపెనీలో కీలక స్థానంలో ఉన్న రాజ్ సుబ్రహ్మణ్యం తన ప్రతిభను చాటారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఆయన.. ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యారు.
న్యూయార్క్ లోని సిరకస్ వర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో పీజీ పూర్తి చేసిన ఆయన.. అనంతరం టెక్సాస్ వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే ఫెడెక్స్ లో చేరిన ఆయన అప్పటి నుంచి కంపెనీలో పలు కీలక స్థానాల్లో పని చేశారు. తాజాగా ఆయన.. ఫెడెక్స్ బోర్డులో ఉన్న రాజ్.. సీఈవో తర్వాత కూడా బోర్డులో కొనసాగనున్నారు.
ఇకపై తాను సంస్థ ఎగ్జిక్యూటివి ఛైర్మన్ గా కొనసాగుతానని పేర్కొన్నారు. ఏమైనా.. భారతీయుల ప్రతిభ అంతర్జాతీయ వేదికల మీద ఇప్పటికే నిరూపితం కావటం.. పలువురు ప్రవాస భారతీయులు టాప్ అమెరికన్ కంపెనీల్లో కీలక భూమిక పోషిస్తున్న వేళ.. మనోడు మరొకరు దిగ్గజ కంపెనీకి సారథ్యాన్ని చేపట్టటం భారతీయులందరికి గర్వకారణంగా చెప్పక తప్పదు.