ఇక నుంచి ఉక్కు లాంటి రోడ్లు.. సరికొత్త ప్రయోగం!

రోడ్లు పాడైపోవటం దేశంలో పెద్ద సమస్యగా మారింది. సిమెంటు రోడ్డైనా, తారు రోడ్డయినా వేసిన కొద్దిరోజులకే కొండెక్కిపోతోంది. దాంతో గతుకుల రహదారుల్లోనే జనాలు ప్రయాణించాల్సొస్తోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవ్వక తప్పటం లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణంలో వినూత్న ప్రయోగం చేసింది. అదేమిటంటే ఉక్కు వ్యర్థాలతో రోడ్డు వేయాలని డిసైడ్ అయ్యింది.

అలా డిసైడ్ కాగానే రంగంలోకి దిగేసింది. గుజరాత్ లోని సూరత్ నగరంలో హజీరా పారిశ్రామిక ప్రాంతముంది. ఈ ప్రాంతంలో సుమారు కిలోమీటరుకు పైగా పొడవుతో ఒక రోడ్డును నిర్మించింది. ఈ రోడ్డు విశేషం ఏమిటంటే పూర్తిగా ఉక్కు వ్యర్థాలతో నిర్మించటమే. కేంద్ర రహదారుల పరిశోధన సంస్ధ ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు చేసి మొత్తానికి ఆరు లైన్ల రోడ్డును ఉక్కు వ్యర్ధాలతో నిర్మించారు. ఎంత పెద్ద వర్షం వచ్చినా ఈ రోడ్డులో ఎక్కడా గుంతలపడే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా ఈ రోడ్డుపై ఎన్ని చక్రాలున్న హెవీ వెహికల్స్ ప్రయాణం చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదట. పైగా మామూలుగా వేసే రోడ్ల ఖర్చుతో పోలిస్తే 30 శాతం తక్కువ ఖర్చుతోనే రోడ్డు వేయచ్చట. ప్రస్తుతం ప్రతి సంవత్సరం దేశం మొత్తం మీద 1.9 కోట్ల టన్నుల ఉక్కు వ్యర్ధాలు వృధాగా పోతున్నట్లు ఓ అంచనా. 2030 కల్లా ఈ వ్యర్ధాలు 5 కోట్ల టన్నులకు చేరుకోవచ్చని ఓ అంచనా. మరన్ని కోట్ల టన్నుల ఉక్కు వ్యర్ధాలను ఏమి చేసుకోవాలి ? ఎలా రీ యూజ్ చేసుకోవాలనే విషయంలో కేంద్రం సీనియస్ గా దృష్టిపెట్టింది.

అందులో నుండి వచ్చిన ఆలోచనే ఉక్కు వ్యర్ధాలతో రోడ్లు నిర్మించటం. మొత్తం మీద ప్రయోగం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. అందుకనే ఈ ప్రయోగాన్ని మరిన్ని ప్రాంతాల్లో చేయాలని కేంద్రం అనుకుంటోంది. అన్నీ ప్రాంతాల్లోను సక్సెస్ అయిపోతే ఇక డైరెక్టుగా మన రహదారులు ఉక్కు రహదారులైపోతాయేమో చూడాలి.