భారత క్రికెట్ జట్టులో చోటు కోసం ఫిట్ నెస్ తో పాటు యోయో టెస్టులో కూడా పాసవ్వాల్సిందేనని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక, యోయో టెస్టులో విఫలమైతే ఐపీఎల్ లో ఆడనివ్వబోమంటూ ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే, మితిమీరిన క్రికెట్ వల్ల చాలా మంది ఆటగాళ్లు ఆ టెస్టులో ఫెయిల్ అవుతున్నారు. ఇటీవల యంగ్ క్రికెటర్ పృథ్వీ షా యోయో టెస్ట్ ఫెయిల్ కావడమే నిదర్శనం.
దీంతో, ఆటగాళ్లంతా యోయో అంటూ బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే యోయో టెస్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యోయో టెస్టులను ఆటగాళ్లకు గుదిబండగా మారనివ్వబోమని స్పష్టం చేసింది. యోయో టెస్టులను కష్టంగా మార్చబోమని, అది ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని బీసీసీఐ అభిప్రాయపడింది.
ఇటీవలి కాలంలో ఆటగాళ్లంతా ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నారని, కాబట్టి ఇకపై ఆటగాళ్ల మీద అనవసర ఒత్తిడిని పెంచాలనుకోవట్లేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. దీంతో, ఇకపై జట్టు సెలెక్షన్ కోసం ఆటగాళ్లకు నిర్వహించే యోయో టెస్టును కఠినతరం చేయకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. యోయో టెస్ట్ ను మరింత కఠినతరం చేయబోమని సడలింపులు ఇచ్చేదిశగా బీసీసీఐ అధికారి వెల్లడించడతో టీమిండియా, ఐపీఎల్ ఆటగాళ్లకు ఊరట లభించినట్లయింది.
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆటగాళ్లు ఇప్పటికే దీర్ఘకాలంగా బయోబబుల్‌లో ఉంటున్నారని, దీంతో మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారుని బీసీసీఐ అభిప్రాయపడుతోందట. అయితే, ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో యోయో పాసవ్వాలనే నిబంధన ఉండడం సబబేనని, కానీ, ఐపీఎల్ వంటి టోర్నీకి ఇది అవసరంలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జట్టులో చోటు కోసం మైదానంలో రాణించి అద్భుతమైన గణాంకాలు నమోదు చేసినా…యోయో టెస్టులో సత్తా చాటితేనే జట్టులో చోటు దక్కడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే యోయోపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates