సమకాలీన క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్, బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. నిలకడగా పరుగుల వరద పారిస్తూ….అనతి కాలంలోనే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన ఘనత కోహ్లీకి సొంతం. విరాట్ మైదానంలో వీర విహారం చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు….ఓ పద్ధతిగా ఎటువంటి బౌలర్ నైనా ఎదుర్కొని మైదానం నలువైపులా బౌండరీలు బాదడం ఒక్క విరాట్ కే చెల్లుతుంది.
క్రికెట్ దేవుడు, లెజెండరీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలుకొట్టగల అవకాశాలున్న సమకాలీన క్రికెటర్లలో విరాట్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే మొహాలీ వేదికగా కెరీర్ లో తన 100వ టెస్టు ఆడుతున్న కోహ్లీ మరో రికార్డు బద్దలుకొట్టాడు. 8000 పరుగుల క్లబ్ లో చేరిన ఆరో భారతీయ బ్యాట్స్ మన్ గా కోహ్లీ చరిత్ర పుటల్లోకెక్కాడు. 100వ టెస్టులో కోహ్లీ 38వ పరుగు సాధించడంతో ఈ మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు, 900 బౌండరీలు సాధించిన ఏడో భారతీయ బ్యాట్స్ మన్ గా కోహ్లీ మరో రికార్డు అందుకున్నాడు.
100 టెస్టులు ఆడిన కోహ్లీ దాదాపు 51 సగటుతో 27 శతకాలు, 28 అర్థ శతకాలు బాది 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 8 వేల పరుగులు చేసిన 32వ ఆటగాడిగా, 6వ భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, ద్రావిడ్, సునీల్ గవాస్కర్, లక్ష్మణ్, సెహ్వాగ్ లు ఈ ఘనత సాధించారు.
మరోవైపు, మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా డ్రింక్స్ బ్రేక్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (29), మయాంక్ అగర్వాల్ (33) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం హనుమ విహారీ, కోహ్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. విహారీ అర్ధ శతకం (54) సాధించి సెంచరీవైపు దూసుకుపోతుండగా…కోహ్లీ 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు.