ఊహించ‌ని వివాదంలో కోహ్లి

విరాట్ కోహ్లికి కెరీర్లో ఎన్న‌డూ లేనంత బ్యాడ్ టైం న‌డుస్తోంది. అంత‌ర్జాతీయ కెరీర్ ఆరంభ‌మైన ద‌గ్గ‌ర్నుంచి.. రెండేళ్ల ముందు వ‌ర‌కు చూస్తే పైకి ఎద‌గ‌డ‌మే త‌ప్ప కిందికి ప‌డ‌ట‌మే లేదు. ప్ర‌పంచంలోనే మేటి బ్యాట్స్‌మ‌న్‌గా పేరు తెచ్చుకోవ‌డంతో పాటు మూడు ఫార్మాట్ల‌లో విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకుని త‌న హ‌వాను న‌డిపించాడు. కానీ గ‌త రెండేళ్ల‌లో మొత్తం క‌థ మారిపోయింది. ఫామ్ ప‌డిపోయింది. రెండేళ్ల‌కు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచ‌రీ లేదు. గ‌త మూడు నెల‌ల్లో అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య మూడు ఫార్మాట్ల‌లోనూ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు.

దీనికి సంబంధించి ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే.. ఇప్పుడు అనుకోని వివాదం కోహ్లిని చుట్టుముట్టింది. ఆదివారం ద‌క్షిణాఫ్రికాతో చివ‌రి వ‌న్డే సంద‌ర్భంగా మ్యాచ్ ఆరంభానికి ముందు భార‌త జాతీయ గీతం పాడే స‌మ‌యంలో కోహ్లి వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదాస్ప‌ద‌మైంది.

మిగ‌తా స‌హ‌చ‌రులంతా జాతీయ గీతంతో ప‌దం క‌లుపుతుంటే.. కోహ్లి పాట పాడ‌క‌పోగా నోట్లో చూయింగ్ గ‌మ్ వేసుకుని న‌ములుతూ క‌నిపించాడు. ఇదేదో య‌థాలాపంగా జ‌రిగిన విష‌యం లాగా అనిపించ‌డం లేదు. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం పాడ‌టాన్ని ఎవ్వ‌రూ మొక్కుబ‌డిగా తీసుకోలేరు. ఆ స‌మ‌యంలో ఒకింత గ‌ర్వంతో క‌నిపిస్తారు. గీతం ఆరంభం కాగానే అంద‌రూ అల‌ర్ట‌యిపోతారు.

అలాంటిది కోహ్లి చూయింగ్ గ‌మ్ న‌ములుతూ క‌నిపించ‌డం, ఆ వీడియో సోష‌ల్ మీడియాలోకి రావ‌డంతో అత‌డి మీద నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. ఇది దేశాన్ని, జాతీయ గీతాన్ని అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మే అంటూ అత‌ణ్ని తిట్టిపోస్తున్నారు. త‌న‌ను వ‌న్డే కెప్టెన్‌గా త‌ప్పించ‌డంతో అలిగి టెస్టు కెప్టెన్సీ వ‌దిలేసిన విరాట్‌.. భార‌త జ‌ట్టుకు ఆడ‌టం ప‌ట్ల ఇంత‌కుముందులా గ‌ర్వంగా ఫీల‌వ్వ‌ట్లేద‌ని.. త‌న ఫ్ర‌స్టేష‌న్‌ను ఇలా చూపిస్తున్నాడ‌న్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.