థర్డ్ వేవ్ ఎంతకాలం ఉంటుందో తెలుసా?

మన దేశంలో థర్డ్ వేవ్ ఎంతకాలం ఉంటుందో తెలుసా ? నాలుగు నెలలవరకు థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని కాన్పూర్ ఐఐటి ప్రొఫెసర్ మహేంద్ర అగర్వాల్ చెప్పారు. ఇపుడు జనవరిలో మొదలైన థర్డ్ వేవ్ ప్రభావం ఏప్రిల్ వరకు కంటిన్యు అవుతందని చెప్పిన మాట సంచలనంగా మారింది. పైగా రోజుకు 1.8 లక్షల కేసులు నమోదవుతాయని ప్రొఫెసర్ అంచనా వేశారు. రోజుకు 1.8 లక్షల కేసులు నమోదైనా ఆసుపత్రుల్లో చేరే వారిసంఖ్య తక్కువగానే ఉండచ్చని చెప్పి కాస్త ఊరటకలిగించారు.

తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలే సూపర్ స్ప్రెడర్లుగా మారుతాయని అగర్వాల్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించటం చాలా ప్రమాదకరమని కూడా చెప్పారు. గతంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ఏమి జరిగిందో అందరు గుర్తుంచుకోవాలని ప్రొఫెసర్ చెప్పారు. అప్పట్లో కరోనా వైరస్ తీవ్రతను ఎవరు పట్టించుకోకుండా ర్యాలీలు, రోడ్డుషోలు, బహిరంగసభలకు జనాలను తరలించిన కారణంగానే దేశంలో సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందన్నారు.

ఎన్నికల సమయంలో కోవిడ్ నిబందనలు పాటించటం ఎవరికీ సాధ్యం కాదని కూడా అగర్వాల్ చెప్పారు. మార్చి నాటికి దేశం మొత్తంమీద 2 లక్షల పడకలు అవసరమవుతాయని కూడా ప్రొఫెసర్ ముందుగానే హెచ్చరించారు. సెకండ్ వేవ్ లో వచ్చినట్లు ఆక్సిజన్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉందని గట్టిగా చెప్పారు. పనిలో పనిగా అగర్వాల్ ఒక మంచి మాట కూడా చెప్పారు.

అదేమిటంటే మనదేశంలోని జనాభాకు రోగనిరోధక శక్తి చాలా ఎక్కువట. ఆఫ్రికాతో పాటు భారత్ లోని 80 శాతం జనాభా 45 ఏళ్ళలోపు వారేఅని అగర్వాల్ చెప్పారు. దీనివల్లే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందన్నారు. ఏదేమైనా దేశంలో ఇపుడందరు ఐదు రాష్ట్రాల ఎన్నికల వైపే చూస్తున్నారు. థర్డ్ వేవ్ ఎక్కడ కమ్ముకుంటుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఈ భయంలోనే అలహాబాద్ హైకోర్టు కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను వాయిదా వేయమని కేంద్ర ఎన్నికల కమీషన్ కు సూచించింది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక జనాభా అంటే 24 కోట్లున్నది యూపీలో మాత్రమే. ఇక్కడ గనుక థర్డ్ వేవ్ అంటుకున్నదంటే అంతే సంగతులు.