ఏషియా రిచ్చెస్ట్ గా అదానీ

కొట్టడమంటే చేత్తోనో లేకపోతే కర్ర తీసుకునో కొట్టడం కాదు. సంపదలో ముఖేష్ ను అదానీ మించి పోయారని అర్ధం. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ మొదటసారి నిలిచారు. ఇప్పటివరకు ఈ ప్లేస్ లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉండేవారు. దాదాపు పదేళ్లుగా నెంబర్ వన్ రిచ్చెస్ట్ గా ఉన్న ముఖేష్ ప్లేసును తాజాగా అదానీ కొట్టేసినట్లు బ్లూమ్ బర్గ్ తాజా నివేదికలో ప్రకటించింది.

గడచిన ఏడాదిలో అదానీ సంపద విపరీతంగా పెరిగిపోయింది. అదానీ సంపద ఏ స్థాయిలో ఉందంటే రోజుకు సుమారు రు. వెయ్యి కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం ఆదాయాన్ని లెక్కిస్తే రు. 4.12 లక్షల కోట్లుగా తేలింది. ఇదే సమయంలో ముఖేష్ సంపద నికర విలువ రు. 1.07 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. అంటే వీరిద్దరి సంపద లో ఉన్న వ్యత్యాసమే సుమారు రు. 3 లక్షల కోట్లు. ఈ తేడా వల్లే ముఖేష్ స్ధానంలో ఆసియా నెంబర్ వన్ రిచ్చెస్ట్ ప్లేసులోకి అదానీ వచ్చి కూర్చున్నారు.

మొన్నటి వరకు అంటే మంగళవారం వరకు రిలయన్స్ అధినేత సంపద 9100 కోట్ల డాలర్లుగా ఉండేది. అదానీ సంపద విలువ 8880 కోట్ల డాలర్లు గా ఉండేది. అయితే బుధవారం నాడు షేర్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో ముఖేష్ సంపద కూడా అదే దామాషాలో పడిపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూపు షేర్ల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి చేరుకున్నాయి. దాంతో ఒక్కసారిగా అదానీకి జాక్ పాట్ కొట్టినట్లయ్యింది. వీళ్ళ సంపద విలువలు షేర్ల ధరలపైన ఆధారపడుంటుందన్న విషయం తెలిసిందే.

అదానీ గ్రూపులో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్, అదానీ పవర్స్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీల షేర్ల ధరలన్నీ మంచి ధరలు పలుకుతున్నాయి షేర్ మార్కెట్లో. షేర్లపైన పెట్టుబడులు పెట్టిన వారికి కూడా బాగా లాభాలు అందిస్తున్నాయి. దీంతోనే అదానీ ఆసియా కుబేరుల్లో మొదటిసారి నెంబర్ వన్ స్ధానంకు చేరుకున్నారు.