మాస్కుల నుంచి విముక్తి ఎప్పుడో చెప్పిన కృష్ణ ఎల్లా

కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా.. ఈ మాయదారి మహమ్మారికి ముందు భారత్ బయోటెక్ అన్న మాట చెబితే.. అదేం కంపెనీ అనే పరిస్థితి. ఇప్పుడు అదే భారత్ బయోటెక్ భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైన కంపెనీగా నిలిచింది. కరోనాకు టీకాను కనిపెట్టే విషయంలో తోపుల్లాంటి కంపెనీలు రంగంలోకి దిగితే.. దానిపై విజయం సాధించేలా వ్యాక్సిన్ ను సిద్ధం చేసిన అతి కొద్ది కంపెనీల్లో భారత్ బయోటెక్ ఒకటి.

ఈ సంస్థ తాజాగా సరికొత్త ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ సూది మందు రూపంలో ఉంటుందన్నది తెలిసిందే. అందుకు భిన్నంగా దీన్ని చుక్కల మందు రూపంలో తయారు చేసే ప్రయోగం దాదాపుగా తుదిదశకు వచ్చేసినట్లే. ఈ చుక్కల మందు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో చాలానే మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. ముక్కులో వేసుకునే ఈ చుక్కల మందు తర్వాత ముఖానికి మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. దాని నుంచి విముక్తి పొందొచ్చన్న కీలకమైన వ్యాఖ్య భారత్
బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా నోటి నుంచి వచ్చింది.
అదెలా అన్నది ఆయన మాటల్లోనే వింటే బాగుంటుంది.ఆయనేమన్నారంటే.. ‘నోసల్ వ్యాక్సిన్ ఇస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించే వీలుంది. అప్పుడు మాస్కులు వాడాల్సిన అవసరం ఉండదు. సూది మందు రూపంలో టీకా ఇస్తే.. అది ఊపిరితిత్తుల పైభాగానికి రక్షణ ఇవ్వదు కనుక మాస్క్ ధరించాలి. కానీ.. నోసల్ వ్యాక్సిన్ ఆ భాగానికి రక్షణ కల్పిస్తుంది’’ అంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

అదే సమయంలో.. కరోనా సోకని వారు ఇప్పటివరకు ఆనందపడుతూ ఉండొచ్చు. కానీ.. తాజాగా కృష్ణ ఎల్లా మాటల్ని విన్నప్పుడు మాత్రం షాక్ తగలటం ఖాయం. ఎందుకంటే.. కొవాగ్జిన్ నోసల్ డ్రాప్స్.. కరోనాసోకని వారికి పెద్దగా పని చేయదని చెబుతున్నారు. తాము చేసిన పరిశోధనలో ఈ విషయాన్నిగుర్తించినట్లు చెప్పారు. ‘‘నోసల్ వ్యాక్సిన్ ను కరోనా సోకని వ్యక్తికి ఇస్తే అది సరిగా పని చేయదు. కానీ.. ఇన్ ఫెక్షన్ కు గురైన వ్యక్తి కానీ.. తొలి డోసు తీసుకున్న వ్యక్తికి కానీ దీన్ని ఇస్తే మాత్రం బాగా పని చేస్తున్నట్లు గుర్తించాం. ఈ ఇమ్యునాలజీని ప్రపంచంలో తొలిసారి కనుగొన్న సంస్థ మాదే’’ అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారు.. సోకనివారు..మొదటి డోసు కింద కొవాగ్జిన్ సూది మందును.. రెండో డోసు కింద నోసల్ వ్యాక్సిన్ ను వేసుకుంటే సరిపోతుందన్న ఆలోచనలో తాము ఉన్నట్లు చెప్పారు. రెండో డోసు కింద నోసల్ వ్యాక్సిన్ ఇస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించే వీలుందన్న మాట ఆయన నోటి నుంచి రావటం గమనార్హం.

ఇదిలా ఉంటే నోసల్ వ్యాక్సిన్ అందుబాటులోకివచ్చిన తర్వాత కరోనాకు గురైన వారు రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన అవసరం లేదని..ఒక్క నోసల్ వ్యాక్సిన్ డోసు తీసుకుంటే సరిపోతుందన్న వాదనను వినిపించటం గమనార్హం. కరోనాను నిరోధించాలంటేూ నాసికా టీకా తప్ప మరో మార్గం లేదని.. దీని రెండో దశ పరీక్షల్ని పూర్తి చేశామని.. ఫలితాల విశ్లేషణ జరుగుతోందని.. మూడు నెలల్లో ఆ వ్యాక్సిన్ వచ్చే వీలుందన్న మాటను కృష్ణ ఎల్లా చెప్పారు. అంటే.. వచ్చే ఫిబ్రవరి.. మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే వీలుందన్న మాట. మరేం జరుగుతుందో చూడాలి.