కేరళలో ఓ ఏనుగు విషాదాంతం దేశాన్ని కదిలించింది. ఓ ఏనుగుకు స్థానికులు ఆహారం ఆశ చూపి పైనాపిల్ ఇవ్వగా.. అది తినబోతుండటా దాని లోపలున్న పేలుడు పదార్థాలు పేలి అది తీవ్రంగా గాయపడి.. కొన్ని రోజుల పాటు నొప్పితో అల్లాడి ప్రాణాలు వదిలిందని వార్తలొచ్చాయి.
దీనిపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు స్పందించారు. జంతువుల పట్ల మనిషి క్రూరత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు వేశారు. ఈ క్యాంపైన్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. వ్యవహారం చాలా పెద్దదైపోవడం, కేరళలో ఇలాంటి ఘటనలు సహజం అంటూ ప్రచారం జరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమ్తత్తమైంది.
జిల్లా స్థాయి అధికారుల్ని నియమించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఐతే ఈ విచారణలో వెల్లడైన వాస్తవాలు వేరన్నది అక్కడి మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఆ ఏనుగుకు ఎవరూ ఆహారం ఆశ చూపి దాని మరణానికి కారణం కాలేదని విచారణలో వెల్లడైంది. కేరళలో అటవీ ప్రాంతం ఎక్కువ. చాలామంది అడవుల్లో, అడవులకు సమీపంలో నివాసం ఉంటారు. అడవి పందులు, ఇతర క్రూర జంతువులు వాళ్ల ఇళ్లపై, పంటలపై దాడులు చేయడం ఎప్పుడూ జరిగే విషయమే. వాటిని నివారించడం కోసం ఉచ్చు వేస్తారు. పందుల కోసమే ఇలా పైనాపిల్స్‌లో మందుగుండు సామగ్రిని పెడతారు. ఐతే వాటి కోసం పెట్టిన పైనాపిల్‌ను ఏనుగు తినడంతో దాని ప్రాణం పోయింది. ఏనుగుకు అలా జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారులు దాన్ని చేరుకునే సరికే మరణించింది.
దీని కంటే కొన్ని రోజుల ముందు కూడా ఓ ఏనుగు ఇలాగే మరణించినట్లు సమాచారం. ఐతే ఈ ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించినపుడు.. అది గర్భవతి అని తేలడంతో ఈ విషయం బ్లో అప్ అయింది. దాని మీద మానవీయ కథనాలు వచ్చాయి. సెలబ్రెటీలు ఇక రెచ్చిపోయిన కన్నీళ్లు కార్చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates