ఒత్తిడే కొంపముంచిందా ?

ఇపుడిదే ప్రశ్న ప్రపంచంలోని భారత్ అభిమానులను పట్టి పీడిస్తోంది. టీ20 ప్రపంచ కప్ లో మొట్టమొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో భారత్ ఓడిపోవటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకోతున్నారు. ఆటలన్నాక గెలుపులోములు సహజమే. కానీ ఓటమి ఎంత గౌరవప్రదంగా ఉందనేది చాలా కీలకం. పాకిస్తాన్ పై భారత్ ఘోరంగా ఓడిపోయింది. అలా ఇలా కాదు ఇటు మొదట బ్యాటింగ్ లో తర్వాత బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది.

ఒకళ్ళో ఇద్దరో కాదు మొత్తానికి మొత్తం జట్టులోని 11 మంది సమిష్టి వైఫల్యం వల్లే చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోర ఓటమి ఎదురైంది. మొదటి బ్యాటింగ్ చేసిన మన జట్టు బ్యాట్స్ మెన్ పూర్తి నిర్లక్ష్యంతో ఆడారు. అనవసరంగా తమ వికెట్లను పారేసుకున్నారు. పాకిస్తాన్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది వాస్తవమే. కానీ వాళ్ళ బౌలింగ్ ఆడలేనంత భయకరంగా అయితే లేదు. మన బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లను పారేసుకున్నారంతే.

రిషబ్ పంత్ ను కనుక విరాట్ కోహ్లీ కంట్రోల్ లో పెట్టుంటే మరో 20 పరుగులు అదనంగా వచ్చుండేవి. పంత్ బ్యాటింగ్ కు వచ్చిన దగ్గర నుంచి కాన్ఫిడెంట్ గా ఒక్క స్ట్రోక్ కూడా ఆడలేదు. మొదటి నుండి చాలా అసహనంగానే కదులుతు మొత్తానికి 39 పరుగులు చేశాడు. గబ గబా ఆడాలన్న ఆతృతలోనే తన వికెట్ ను సమర్పించుకున్నాడు. కోహ్లీ గనుక పంత్ ను కాస్త కంట్రోల్ చేసుంటే మరిన్ని పరుగులు వచ్చేవే. మొదట్లో కోహ్లీ కూడా పరుగుల కోసం కష్టపడ్డాడు. తర్వాత పుంజుకుని 57 పరుగులు చేశాడు.

బ్యాట్స్ మెన్ లో మొదటి నలుగురు నిర్లక్ష్యంగా ఆడటం వల్లే అవుటయ్యారు. అప్పటికీ 151 పరుగులు చేయటమంటే కాస్త గౌరవప్రదమైన స్కోర్ కిందే లెక్క. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్క బౌలర్ కూడా పాక్ బ్యాట్స్ మెన్ పై ఏ దశలో కూడా ఒత్తిడి తేలేకపోయారు. పాక్ బౌలర్లేమో ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ పెట్టుకుని ఆఫ్ స్టంప్ లక్ష్యంగా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో మన బౌలర్లు లెగ్ స్టంప్ మీద వేసి పదే పదే పరుగులు సమర్పించుకున్నారు. 10 వికెట్ల విజయం సాధించిందంటే పాక్ బ్యాట్స్ మెన్ ఎంత చక్కగా ఆడారో అర్థమైపోతోంది.

లెట్ స్టంప్ మీద బాల్స్ వేస్తే ఎలాంటి బ్యాట్స్ మన్ అయినా పరుగులు ఈజీగా చేస్తారు. ఇంత చిన్న విషయం కూడా వందలాది మ్యాచులు ఆడిన మన బౌలర్లకు తెలీకపోవటమే ఆశ్చర్య. కెప్టెన్ కూడా బౌలర్లను నియంత్రించినట్లు కనబడలేదు. హోలు మొత్తం మీద ఎలా ఆడకూడదో అలా ఆడి ఘోరంగా ఓడిపోయారు. సరే ఇంతటితో ఏమీ అయిపోలేదు. ఎందుకంటే ఓడిపోయింది మొదటి మ్యాచే కాబట్టి నష్టం లేదు. ఎందుకంటే ఇంకా నాలుగు మ్యాచులున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్నింటినీ ఆడి గెలిస్తే దర్జాగా సెమీఫైనల్స్ కు చేరుకోవచ్చు.