కరోనా మహమ్మారి ఎప్పుడు మనల్ని వీడిపోతుందా…? ఈ మాస్క్ లు లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటామా అని అందరం ఎదురు చూస్తున్నాం. అయితే.. ఇలాంటి సమయంలో.. కరోనా గురించి నిపుణులు పెద్ద బాంబు పేల్చారు. ఈ మహమ్మారి ఇక మన జీవితాల్లో శాశ్వతం కానుందని వారు హెచ్చరిస్తున్నారు.
మరో ఆరు నెలల్లో ఈ మహమ్మారి ఎండమిక్ దశకు చేరుకోనుందని.. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్ర డైరెక్టర్ సుజీత్ సింగ్ తెలిపారు. అంటే.. ఇక ఈ కరోనా .. మన జీవితాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని అర్థమట. కేవలం ఆరు నెలల్లో ఇది జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఆరు నెలల్లో ఇది ఎండెమిక్ దశకు చేరుకుంటుందని అన్నారు. అయితే మరణాల రేటు, సంక్రమణ రేటు నియంత్రణలో ఉన్నట్టయితే మహమ్మారిని కట్టడి చేయవచ్చని చెప్పారు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళ కూడా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోందని సుజీత్ సింగ్ తెలిపారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషనే కీలకమని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 75 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారని తెలిపారు. వ్యాక్సిన్ సమర్థత 70 శాతంగా ఉన్నా… దాదాపు 50 కోట్ల మందికి ఇమ్యూనిటీ వచ్చినట్టేనని చెప్పారు.
వ్యాక్సిన్ వల్ల వచ్చిన రోగ నిరోధకశక్తి 70 నుంచి 100 రోజుల తర్వాత క్రమంగా తగ్గుతుందని సుజీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్లు వెలుగుచూడటం లేదని… ఒకవేళ కొత్త వేరియంట్ వచ్చినా దాన్ని థర్డ్ వేవ్ గా భావించకూడదని అన్నారు. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ కావడం కొంత ఆందోళనకు కారణమవుతోందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates