భారత్‌కు షాక్.. పారాలింపిక్స్‌లో పతకం వెనక్కి

పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు పతకాల మీద పతకాలు గెలుస్తున్న వేళ.. ఒక పెద్ద షాక్. భారత్‌కు దక్కిన ఒక కాంస్య పతకాన్ని నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. ఆదివారం జరిగిన డిస్కస్ త్రో పోటీల్లో మూడో స్థానం సాధించి కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడు వినోద్ కుమార్‌ను నిర్వాహకులు అనర్హుడిగా ప్రకటించారు.

అతను 19.1 మీటర్లు డిస్కస్‌ను విసిరి తాను పోటీ పడ్డ ఎఫ్-52 విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. ఐతే ఈ విభాగంలో పోటీకి వినోద్ కుమార్ అనర్హుడంటూ తోటి క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమస్య మొదలైంది. పారాలింపిక్స్‌లో పోటీ పడే వికలాంగ క్రీడాకారులకు ఉన్న వైకల్యం స్థాయిని బట్టి వారిని వివిధ విభాగాల్లో పోటీ పడేందుకు అనుమతులిస్తారు. బలహీన కండరాల శక్తి, అవయవ లోపం.. లేదా కాళ్ల పొడవులో తేడా ఉన్నవాళ్లు ఎఫ్-52 కింద పోటీ పడే అవకాశం ఉంటుంది.

ఐతే పారాలింపిక్స్ పోటీలు ఈ నెల 24న ఆరంభం కాగా.. ఈ నెల 22నే వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన నిర్వాహకులు అథ్లెట్ల జాబితాను ప్రకటించారు. అందులో వినోద్ కుమార్‌ను ఎఫ్-52 విభాగానికి అర్హుడిగానే పేర్కొన్నారు. కానీ పోటీల సందర్భంగా వినోద్‌ను పరిశీలించిన తోటి అథ్లెట్లు.. అతడికి ఎఫ్-52 విభాగంలో పోటీ పడే స్థాయి వైకల్యం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దీని పై నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.

దీంతో నిపుణుల కమిటీ అతడికి పరీక్షలు నిర్వహించి.. అతను ఈ విభాగంలో పోటీ పడేందుకు అనర్హుడిగా పేర్కొంది. దీంతో నిర్వాహకులు వినోద్ సాధించిన కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన క్రీడాకారుడికి వినోద్ గెలిచిన కాంస్యం దక్కనుంది. ఐతే ముందు వినోద్‌కు పారాలింపిక్ కమిటీనే అనుమతులు మంజూరు చేసి.. ఇప్పుడు అతను ఎఫ్-52 విభాగానికి అనర్హుడిగా పేర్కొనడం, పతకాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారాలింపిక్స్‌లో వినోద్ సాధించిన కాంస్యంతో కలిసి భారత్ సోమవారం నాటికి ఏడు పతకాలు గెలిచింది. అందులో ఇప్పుడు ఒకటి తగ్గింది.
.