సంచలన పతకం.. త్రుటిలో పోయిందే

టోక్యో ఒలింపిక్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ఆటలో భారత్‌కు పతకం దక్కేలా కనిపించింది. ఆ ఆట గురించి ఎవరికీ పట్టింపు లేదు. అందులో ఓ భారత అథ్లెట్ బరిలో ఉన్నారని కూడా చాలామందికి తెలియదు. అందరూ షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల మీద దృష్టిపెడతే.. ఎవ్వరికీ పట్టని ఆటలో ఓ అమ్మాయి సంచలన ప్రదర్శనతో పతకానికి చేరువ అయింది.

శనివారం ఆ అమ్మాయి పోడియంపై నిలవడం, భారత్ ఖాతాలో మరో పతకం జమ కావడం లాంఛనమే అనుకున్నారు. కానీ పోటీ చివరి రోజు కథ మారిపోయింది. ఆ అమ్మాయి త్రుటిలో పతకానికి దూరం అయింది. సంచలనం సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. ఆ అమ్మాయి పేరు.. అదితి అశోక్. తన ఆట గోల్ఫ్. ఈ ఆటలో భారత్‌కు పతకావకాశాలు ఉన్నాయని ఒలింపిక్స్ ఆరంభానికి ముందు ఎవరిలోనూ అంచనాలు లేవు. అదితి పోటీ గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు.

ఐతే నాలుగు రోజుల పాటు సాగే పోటీలో.. తొలి రోజు తొలి రౌండ్ తర్వాత టాప్-2లో నిలిచి ఆశ్చర్యానికి గురి చేసింది అదితి. వరుసగా తర్వాత రెండు రోజుల్లో జరిగిన రౌండ్లలోనూ ఆమె అదే స్థానాన్ని కొనసాగించింది. నాలుగో రౌండ్లోనూ అదే నిలకడను కొనసాగించి ఉంటే ఆమెకు రజతం సొంతమయ్యేది. కనీసం మూడో స్థానం దక్కించుకున్నా కాంస్యం దక్కేది. శనివారం పోటీల చివరి రోజు ఆమె రాణిస్తుందనే అంతా అనుకున్నారు.

అసలు శనివారం టోక్యోలో వర్ష ప్రభావం ఉండటంతో చివరి రౌండ్ జరగదని.. ముందు రోజు టాప్-3లో ఉన్న వాళ్లకే పతకాలు ఇచ్చేస్తారని వార్తలొచ్చాయి. కానీ వరుణుడు భారత అమ్మాయికి సహకరించలేదు. వర్షం ప్రభావం లేకపోవడంతో శనివారం ఆటను కొనసాగించారు. ఐతే చివరి రౌండ్లో అనుకున్నంతగా రాణించలేకపోయిన అదితి.. రెండు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. ఇక శనివారం కాంస్యం కోసం పోటీ పడనున్న రెజ్లర్ బజ్‌రంగ్ పునియా, జావెలిన్ త్రోలో ఫైనల్ ఆడనున్న నీరజ్ చోప్రాల మీదే ఆశలన్నీ. ఇప్పటిదాకా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్.. రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది.