ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఏది అనగానే.. చిన్నపిల్లవాడైనా గుక్క తిప్పుకోకుండా వైజాగ్ పేరు చెబుతారు. ప్రతి ఒక్కరూ విశాఖ అందాలను చూడాలని ఆశపడుతుంటారు. అక్కడి బీచ్ లు.. విశాఖ నగరానికి అదనపు ఆకర్షణ. కాగా… పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు విశాఖ అదనపు అందాలను రూపుదిద్దుకుంటోంది.
విశాఖలోని రుషికొండ-భోగాపురం మధ్య మరో పది బీచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఒక్కో బీచ్‌ను రూ.2.50 కోట్లతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది. విశాఖపట్నం నుంచి భీమునిపట్నం మీదుగా భోగాపురం వరకు ఆరు వరుసల రహదారి అభివృద్ధిలో భాగంగా తీరం వెంబడి కొత్త బీచ్‌లను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది.
ఇందులో భాగంగా తీర ప్రాంత నియంత్రణ జోన్ నిబంధనలకు లోబడి ఆయా బీచ్‌ల్లో తాత్కాలిక నిర్మాణాలతో సదుపాయాలు కల్పించనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.
కొత్త బీచ్‌లు.. 1. సాగర్‌నగర్, 2. తిమ్మాపురం, 3. మంగమూరిపేట, 4. చేపలుప్పాడ, 5. ఐఎన్ఎస్ కళింగ, 6. ఎర్రమట్టి దిబ్బలు, 7. భీమునిపట్నం, 8. నాగాయంపాలెం, 9. అన్నవరం, 10. కంచేరుపాలెం
విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చే నిధులతో తొలిదశలో ఐదు బీచ్‌లను అధికారులు సిద్ధం చేయనున్నారు. రెండోదశలో మిగతావాటిని అభివృద్ధి చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates