మోడీ డొల్లతనం బయటపెట్టిన జర్నలిస్టు మృతి


డానిష్ సిద్ధిఖి.. శుక్రవారం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన పేరు. ఇతను ఒక ఫొటో జర్నలిస్టు. తన విధుల్లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్‌లో పర్యటిస్తున్న అతణ్ని తాలిబన్లు చంపేశారు. కేవలం ఒక ఫొటో జర్నలిస్టు చనిపోతే అతడి పేరు ఇలా ట్రెండ్ అయిపోదు. దీనికి అసలు కారణం వేరే ఉంది.

అతను కరోనా టైంలో మోడీ, ఆయన ప్రభుత్వం డొల్లతనాన్ని బయటపెట్టాడు. ప్రపంచం ముందు మోడీ చేతగానితనాన్ని బట్టబయలు చేశాడు. కరోనా మరణాలను తక్కువ చేసి చూపుతూ.. భారత్ సురక్షితంగానే ఉందంటూ మోడీ, ఆయన ప్రభుత్వం గాంభీర్యం ప్రదర్శిస్తుంటే.. ఢిల్లీలోని ఓ శ్మశాన వాటికలో పదుల సంఖ్యలో ఒకేసారి కాలుతున్న శవాల ఫొటోలను అద్భుతమైన యాంగిల్లో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు డానిష్ సిద్ధిఖి. ఆ ఫొటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది.

ఈ ఫొటోలు మాత్రమే కాదు.. కరోనా మొదలైన కొత్తలో కనీస సమాచారం లేకుండా మోడీ సర్కారు హఠాత్తుగా లాక్ డౌన్ విధిస్తే.. దాని వల్ల వలస కార్మికులు పడుతున్న కష్టాల తాలూకు ఫొటోలు కూడా చాలానే తీశాడు డానిష్. ఒక తండ్రి బిడ్డను మెడపై పెట్టుకుని నడుస్తున్న ఫొటో వైరల్ అయింది అప్పడు. లాక్ డౌన్ టైంలో ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని, అభాగ్యుల కష్టాలను అతను కళ్లకు కట్టినట్లు చూపించాడు తన ఫొటోల ద్వారా. ఇలా జనాల్లో మంచి పేరు సంపాదించిన డానిష్‌.. మోడీ మద్దతుదారుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అతడికి బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా భయపడలేదు.

ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. డానిష్ మద్దతుదారులంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మోడీ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ చేసిన వ్యక్తి మరణాన్ని భాజపా వాళ్లు సెలబ్రేట్ చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.