దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. దీంతో.. థర్డ్ వేవ్ రావడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత 50 రోజుల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న కేసులు.. గత 24 గంటల్లో పెరగడం కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ వ్యాఖ్యలు కాస్త ఆందోళనను కలిగిస్తున్నాయి.
అక్టోబర్-నవంబర్ మధ్య మళ్లీ కేసులు విజృంభించే అవకాశం ఉందంటోంది కమిటీ. కానీ.. సెకెండ్ వేవ్ అంత స్థాయిలో కేసులు రికార్డ్ కాకపోవచ్చని చెబుతోంది. రెండో వేవ్ పీక్స్ లో ఉన్న సమయంలో 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ వస్తే మాత్రం లక్షన్నరకు మించి ఉండకపోవచ్చని అంచనా వేసింది.
ఆగస్టు 20 నాటికి రోజువారీ కేసులు 20వేలకు తగ్గిపోవచ్చని అంటోంది నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ. అయితే అక్టోబర్ 9 నుంచి నవంబర్ 28 మధ్యలో థర్డ్ వేవ్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంటోంది. టీకా డ్రైవ్ వేగవంతంగా కొనసాగితే.. సెకెండ్ వేవ్ అంత ప్రమాదం ఉండకపోవచ్చని అంటోంది.
ప్రస్తుతం డెల్టా ప్లస్ కేసులు దేశవ్యాప్తంగా బయటపడుతుండడం.. కేసులు పెరుగుతుండడం చూస్తుంటే.. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు తప్పేలా లేదని అంటున్నారు నిపుణులు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates