చేతి నిండా డబ్బులు ఉండాలే కానీ కొండ మీద కోతినైనా తేవొచ్చన్న నమ్మకం చాలామందికి ఉంటుంది. ఊహకు వాస్తవానికి మధ్య అంతరాన్ని చాలామంది మిస్ అవుతారు. టెక్నాలజీతో ఏదైనా సాధ్యమని నమ్మేవారికి.. కాలమే వారికి సరైన అవగాహన కల్పిస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది అపర కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు. తన ఎలక్ట్రిక్ కార్లతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆయనకు తీరని కలల్లో ఒకటి.. డ్రైవర్ లెస్ కారు. ఈ ఏడాది చివరకు డ్రైవర్ అవసరం లేని కారును తీసుకొస్తానని నమ్మకంగా చెప్పేశారు.
అయితే.. అందులోని సంక్లిష్టతలు తాజాగా ఎలన్ మస్క్ కు బోధ పడినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. తన కలకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. సెల్ప్ డ్రైవింగ్ కారుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై ఆయన కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. తన ఆలోచనలకు తగ్గట్లు.. కలల కారును రోడ్డు మీదకు తీసుకొస్తానని నమ్మకంగా ఉండేవారు. ఇందుకోసం అతగాడు వందల కోట్లను ఖర్చు చేశారు. అంతేకాదు.. అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కు సరికొత్త అర్థం చెప్పిన వారిలో ఎలన్ మాస్క్ ఒకరు.
ఇప్పటికే ఆయన పేపాల్ సీఈవోగా.. స్పేస్ ఎక్స్ అధినేతగా.. టెస్లా సీఈవోగా సత్తా చాటుతున్న అతడు.. డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా.. ప్రపంచ కార్ల వ్యవస్థను సమూలంగా మార్చేయాలన్న ఆలోచనలో ఉండేవారు. అయితే.. తన ఊహకు వాస్తవానికి మద్య అంతరాన్ని తగ్గిస్తానని నమ్మకంగా ఉండేవారు కానీ.. అది సాధ్యం కాదని తాజాగా తేలిపోయినట్లుగా ఆయన మాటల్ని వింటే అర్థం కాక మానదు. ఈ ఏడాది మొదట్లో అంటే జనవరిలో మాట్లాడిన ఎలన్ మాస్క్.. డ్రైవర్ అవసరం లేకుండా నడిచే కారును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా వెల్లడించి సంచలనంగా మారారు.
ఆయన కంపెనీ ఈ జూన్ లో ఎస్ ప్లెయిడ్ కారులో డ్రైవర్ లెస్ కారు సదుపాయం ఉంటుందని అందరూ భావించినా.. ఆ ఫీచర్ ను ఇవ్వకపోవటం గమనార్హం. దీనికి తాజాగా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆటో పైలెట్ కారును ఇప్పడిప్పుడే మార్కెట్లోకి తీసుకురాలేమని తేల్చేశారు.
సెల్ప్ డ్రైవింగ్ టెక్నాలజీ చాలా జటిలమైనదని.. దీన్ని వాస్తవంలోకి తీసుకురావాలంటే వాస్తవిక ప్రపంచానికి తగ్గట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందుకు అనుగుణంగా రూపొందించాలని పేర్కొన్నారు. “ఇది చాలా కష్టంతో కూడుకున్నది. వాస్తవికతకు ఉన్నంత స్వేచ్ఛ మరి దేనికీ ఉండదు. ఈ విషయాన్ని నేను ఇప్పటివరకు ఊహించలేదు. డ్రైవర్ లేని కారును రూపొందించాలంటే.. వాస్తవిక ప్రపంచానికి తగ్గట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సును రూపొందించటం అంత సులువైనది కాదు” అని చెప్పేయటం ద్వారా.. డ్రైవర్ లెస్ కార్ల ప్రాజెక్టు మీద ఎలన్ మాస్క్ ఆశలు వదిలేసుకున్నారని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates