కరోనా డెల్టా వేరియంట్… సెకండ్ వేవ్ లో భారత్ లో ఎంతలా కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోందనగా.. డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభించడం మొదలుపెట్టింది. ఇది డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరమైనదంటూ ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. దేశంలో.. ఇప్పుడిప్పుడే ఈ డెల్టా ప్లస్ వేరింయట్ కేసులు నమోదౌతున్నాయి. ఇటీవల ఓ మరణం కూడా సంభవించింది. కాగా.. తాజాగా ఏపీలోనూ తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది.
ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ధృవీకరించారు. కొన్ని రోజుల ముందే తిరుపతిలో ఓ వ్యక్తికి డెల్టా ప్లస్ వైరస్ రకం సోకిందని, అయితే తను ఇప్పటికే కోలుకున్నాడన్నారు. ఆయన నుండి ఎవరికీ వైరస్ సోకలేదని మంత్రి ప్రకటించారు.
డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న మంత్రి ఆళ్ల నాని… థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. కరోనా వైరస్ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని సమీక్షలో సీఎం సూచించారని, బ్లాక్ ఫంగస్ కేసులకు కూడా చికిత్సలు కొనసాగుతున్నాయన్నారు.