కొవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే అయ‌స్కాంత శ‌క్తా?

క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ల‌కు ఆ టీకా ప‌ని చేస్తోంద‌న్న దానికి సూచిక‌గా జ్వ‌రం, ఒళ్లునొప్పులు, క‌ళ్లు తిర‌గ‌డం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం మామూలే. ఐతే ఆ వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరానికి అయ‌స్కాంత శ‌క్తి వ‌స్తుందంటూ ఓ ప్ర‌చారం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ్యాక్సిన్ వేసుకున్నాక త‌మ‌కు అయ‌స్కాంత శ‌క్తులు వ‌చ్చాయంటూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

కొన్ని రోజుల కింద‌ట మ‌హారాష్ట్ర‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త‌మ‌కు వ్యాక్సిన్ వేసుకున్నాక అయ‌స్కాంత శ‌క్తులు వ‌చ్చాయ‌న్నారు. మ‌రికొంత‌మంది కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేశారు. కాగా జార్ఖండ్‌కు చెందిన తాహిర్ అనే వ్య‌క్తి ఏకంగా త‌న‌కు మాగ్న‌టిక్ ప‌వ‌ర్ వ‌చ్చిందంటూ ఒక వీడియోనే తీసి పెట్టేశాడు.

ఒంటికి స్పూన్లు, గ‌రిట‌లు, నాణేలు, ఇత‌ర సామ‌గ్రి అంటుకుని ఉన్నట్లుగా ఈ వీడియోలో క‌నిపిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నాక ఒంట్లో ఏదో మార్పు క‌నిపించింద‌ని, దాన్ని అయస్కాంత శ‌క్తిగా భావించి స్పూన్లు, నాణేలు అంటిస్తే అలాగే అతుక్కుపోయాయ‌ని అత‌న‌న్నాడు. క‌రోనా వ్యాక్సిన్ ఫ‌లిత‌మే ఇదంతా అని చెప్పాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అది కాస్తా ఆరోగ్య అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని తాహిర్‌కు వైద్య పరీక్షలు చేశారు. అతడికి అయస్కాంత శక్తులు ఏవీ లేవని, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నదంతా బోగస్ అని తేల్చి చెప్పారు. అంతే కాకుండా తాహిర్‌ ఆరోగ్య పరిస్థితి కాస్త బాగోలేదని 48 గంటల పాటు కొన్ని ప్రత్యేక ఆరోగ్య సలహాలు పాటించాలని సూచించ‌డం గ‌మనార్హం. కొవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల తాహిర్ ఒంటిపై ఎలాంటి దుష్ప్ర‌భావాలు లేవ‌ని కూడా వారు తేల్చి చెప్పారు.