మరికొద్ది సేపట్లో పెళ్లి అనగా.. మండపం నుంచి పెళ్లి కొడుకును కిడ్నాప్ చేశారు. బలవంతంగా ముగ్గురు వ్యక్తులు బైక్ ఎక్కించుకొని దూరంగా తీసుకువెళ్లారు. అనంతరం వధువు కుటుంబసభ్యులకు ఫోన్ చేయించి.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బలవంతంగా చెప్పించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా ఫాహపూర్ ప్రాంతానికి చెందిన జుగల్ కుశ్వాహకు ఇటీవల పెళ్లి కుదిరింది. యువతిది అతని పక్క గ్రామమే. నిశ్చితార్థం అయిపోయింది. పెళ్లి రోజు రానే వచ్చింది. మరికొద్దిసేపట్లో పెళ్లి అనగా.. వరుడు మండపంలో పక్కన తనకు కేటాయించిన గదిలో రెడీ అవుతున్నాడు. అతని దగ్గరకు ముగ్గురు వ్యక్తులు వచ్చి.. మాట్లాడాలంటూ బయటకు పిలిచారు.
అనంతరం బలవంతంగా బైక్ ఎక్కించుకోని వెళ్లి కిడ్నాప్ చేశారు. అతనిచేత పెళ్లికూతురు తండ్రికి ఫోన్ చేయించి.. తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని బలవంతంగా చెప్పించారు. అలా చెప్పకుంటే అక్కడికక్కడే కాల్చి చంపేస్తామని బెదిరించారు. దీంతో.. ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్లు చెప్పినట్లు చేశాడు ఆ వరుడు.
ఆ తర్వాత అతనిని అక్కడే వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. తర్వాత నెమ్మదిగా ఇంటికి చేరిన వరుడు.. జరిగిన అసలు విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పాడు. వారి సహాయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. కాగా.. వరుడిని కిడ్నాప్ చేసింది.. వధువు లవర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మరో మంచి ముహూర్తం చూసుకొని మళ్లీ పెళ్లి జరిపించాలని ఇరువురి కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఆ సమయంలో.. పోలీసులు సెక్యూరిటీ కూడా కల్పిస్తామని చెప్పడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates