మనదేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు, మరణాల లెక్కలపై ప్రభుత్వం చెబుతున్న సమాచారానికి వాస్తవ సమాచారానికి చాలా తేడా ఉందా ? అవుననే అంటున్నది న్యూయార్క్ టైమ్స్ . న్యూయార్క్ టైమ్స్ ఆధ్వర్యంలో భారత్ లో కరోనా వైరస్ కేసులు, మరణాలపై ప్రత్యేకంగా సర్వే జరిగింది. ఈ సర్వేలో ఆశ్చర్యకరం, భయానక లెక్కలు బయటపడ్డాయట.
తమ సర్వేలో మీడియా సంస్ధ 12 మంది నిపుణుల సహకారాన్ని తీసుకుంది. మూడు సీరో సర్వేల సమాచారం, గణాంకవేత్తల సూచనల ప్రకారం రిపోర్టు తయారుచేసింది న్యూయార్క్ టైమ్స్ మీడియా. ఈ లెక్కన దేశంలో కరోనా వైరస్ సుమారుగా 70 కోట్లమందికి సోకినట్లు లెక్కతేల్చింది. అలాగే మరణాలు కూడా 42 లక్షలుంటుందని అంచనా వేసింది.
మే నెల 24వ తేదీకి కేంద్రప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన లెక్కల్లో కరోనా వైరస్ కేసులు 2.69 కోట్లు, మరణాలు 3.07 లక్షలుంది. అంటే ఇటు ప్రభుత్వం అటు న్యూయార్క టైమ్స్ సర్వే లెక్కల ప్రకారం చూస్తే కేసులయినా మరణాలైనా చాలా రెట్ల వ్యత్యాసం ఉందని అర్ధమవుతోంది. కోవిడ్ మరణాల్లో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటోందని తేలింది. అయితే ఈ మరణాలేవీ అధికారిక రికార్డుల్లోకి ఎక్కటంలేదట.
గ్రామీణ ప్రాంతాల్లోని జనాలు పట్టణాలు, నగరాలకు వచ్చి వైద్యం చేయించుకునేంత అవకాశం లేకపోవటంతో తమ ఇళ్ళల్లోనే ఉంటున్నారట. ఇళ్ళల్లోనే కరోనాకు చికిత్స చేయించుకుంటు చనిపోతున్న వారే చాలా ఎక్కువట. ఇదే సమయంలో ప్రభుత్వం దగ్గర కోవిడ్ యంత్రాంగం కూడా పటిష్టంలేదని న్యూయార్క్ టైమ్స్ మీడియా చెప్పింది. సరే అన్నింటికీ మించి వాస్తవ లెక్కలను ఏ ప్రభుత్వం కూడా బయటకు చెప్పదు. ఎందుకంటే జనాలు భయపడే అవకాశం ఉంది కాబట్టి. మొత్తంమీద న్యూయార్క్ టైమ్స్ మీడియా బయటపెట్టిన సర్వే సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates