అమెరికాలో భర్త.. తిరువారూర్ లో భార్య హత్య

నిత్యం రోడ్డు ప్రమాదాలు ఎన్నింటినో చూస్తుంటాం. ఇంచుమించు అలాంటి ఉదంతమే తమిళనాడులోని తిరువారూర్ పట్టణంలో మే 21న చోటు చేసుకుంది. 28 ఏళ్ల యువతి ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ఆఫీసు అయిపోయిన తర్వాత తన స్కూటీతో ఇంటికి బయలుదేరింది. వాయు వేగంతో వచ్చిన ఒక వాహనం ఆమెను ఢీ కొట్టటం.. ఘటనాస్థలంలోనే ఆమె మరణించారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు.

ఃమరణించిన మహిళకు 2015లో విష్ణు ప్రకాశ్ అనే వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉంటున్నాడు. మరణించిన మహిళ.. ఆమె భర్త కలిసి అమెరికాలో కొన్నాళ్లు కలిసి ఉన్నారు. తర్వాత వారి మధ్య గొడవలు పెరగటంతో ఆమె.. తల్లిదండ్రుల వద్దకు వచ్చేశారు. ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. దంపతుల ఇద్దరి మధ్య గొడవలు తగ్గించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. అయినప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో.. విడాకులు అనివార్యమయ్యాయి.

మరణించిన మహిళ కుటుంబ సభ్యుల అనుమానం నేపథ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించినా ఫలితం రాలేదు. కల్లిబుల్లి కబుర్లు చెప్పాడు. దీంతో.. మరింత లోతుగా విచారణ జరిపిన పోలీసులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని.. విచారించగా.. ఒళ్లు జలదరించే నిజాలు బయటకు వచ్చాయి.

అమెరికాలో ఉన్న భర్త.. తన భార్యను యాక్సిడెంట్ చేసి చంపాలని సుపారి ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. విడాకులు ఇవ్వాల్సి వస్తే.. భారీగా భరణం ఇవ్వాల్సి వస్తుందని.. అందుకే దాని నుంచి తప్పించుకోవటానికి యాక్సిడెంట్ ఎత్తు వేసినట్లుగా గుర్తించారు. అతగాడి దుర్మార్గం గురించి తెలుసుకున్న పోలీసులు.. అమెరికాలోని ఇండియన్ ఎంబసీకి తాజా నేరం గురించి సమాచారం ఇప్పించారు. త్వరలోనే విష్ణును ఇండియాకు రప్పించి అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం నిండు ప్రాణాన్ని చంపాలనుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఎంత విడాకులు తీసుకున్నా.. కొంతకాలమైనా కలిసి ఉన్నారు కదా? అలాంటి వ్యక్తిని దారుణంగా చంపాలన్న ఆలోచన ఎలా వస్తుందో?