మగాళ్ళపైనే పగపట్టిన కరోనా వైరస్

కరోనా వైరస్ ముఖ్యంగా మగాళ్ళపైనే పగబట్టినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే రెండు విడతల్లోను కరోనా తీవ్రత మగాళ్ళపైనే ఎక్కువగా కనబడుతోంది. రోగుల్లో గానీ మరణాల్లో కానీ మగాళ్ళ సంఖ్యే చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏదో అవసరాల వల్ల ఇంట్లో నుండి బయటకు వస్తున్న మగాళ్ళు వైరస్ దాడికి తీవ్రంగా గురవుతున్నట్లు సమాచారం. దీనికి అదనంగా ఊబకాయం, దురలవాట్లు, నిర్లక్ష్యం, అనారోగ్యాల వల్లే మగాళ్ళు ఎక్కువగా కరోనా వైరస్ తీవ్రతకు బలవుతున్నట్లు తెలుస్తోంది.

ఆడాళ్ళకన్నా మగాళ్ళల్లో ఇమ్యునిటి ఎక్కువగా ఉన్న కారణంగా కరోనా వైరస్ సోకినా బయటపడటానికి ఎక్కువ రోజులు పడుతోందట. దీనివల్ల ఏమవుతోందటంటే మగాళ్ళల్లో వైరస్ లక్షణాలు బయటపడేటప్పటికే లోలోపలే బాగా ముదిరిపోతోందని సమాచారం. మొదటి వేవ్ కన్నా సెకెండ్ వేవ్ లో వైరస్ తీవ్రత బాగా పెరిగిపోవటంతో కరోనా సోకిన రెండు మూడు రోజుల్లోనే ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్రప్రభావం పడుతోంది. దీంతోనే ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి ప్రాణాల మీదకొచ్చేస్తోంది.

మొదటిదశలో రాష్ట్రంలో 5,64,651 మంది మగాళ్ళు వైరస్ బారినపడ్డారట. వీరిలో మరణాల రేటు 0.90 శాతంగా నమోదైంది. 3,79,425 మంది స్త్రీలకు వైరస్ సోకితే మరణాల రేటు 0.32 శాతం. మరణించిన వారిలో పురుషులు 65 శాతమైతే స్త్రీలు 35 శాతమట. ఈ లెక్కల కారణంగానే వైరస్ దెబ్బకు ఎంతమంది మగాళ్ళు బలైపోతున్నారో అర్ధమైపోతోంది.

ఇక రెండోదశలో 6.5 లక్షల మందికి వైరస్ సోకితే ఇందులో 60 శాతం మగాళ్ళ మీదే ప్రభావం చూపిందట. ఇందులో మరణాల రేటు 0.80 శాతం. వైరస్ సోకిన మహిళల్లో మరణాల రేటు 0.30 శాతం. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే కరోనా వైరస్ పంజాకు మగాళ్ళే బలైపోతున్నట్లు అర్ధమవుతోంది. కాబట్టి వైరస్ విషయంలో మగాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.