చేయని నేరానికి జైలు.. రూ.550 కోట్ల పరిహారం

చేయని తప్పులకు శిక్ష అనుభవించేటోళ్లు చాలామందే ఉంటారు. సరైన సమయంలో సరైన న్యాయం దొరక్క.. దాని బారిన పడి బాధితులుగా మారెవారెందరో కనిపిస్తారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకే చెందింది. అమెరికాకు చెందిన ఇద్దరు సోదరులు చేయని తప్పునకు అడ్డంగా బుక్ అయ్యారు. ఏళ్లకు ఏళ్లు జైల్లో మగ్గారు. చివరకు వారు ఎలాంటి తప్పు చేయలేదని.. వారు నిర్దోషులని తేలింది. అప్పుడు కోర్టు ఏం చేసింది? ఇంతకీ.. ఆ విధి వంచిత సోదరులు ఎవరు? వారి మీద ఉన్న ఆరోపణ ఏమిటి? మూడు దశాబ్దాలు జైల్లో మగ్గిన తర్వాత వారు తప్పు చేయలేదని ఎలా తేలింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

అమెరికాకు చెందిన హెన్రీ మెక్ కాలమ్.. లియోన్ బ్రౌన్ ఇద్దరు సోదరులు. మీ అంచనా కరెక్టే. వారిద్దరు నల్లజాతీయులు. 1983లో పదకొండేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వీరిపై ఆరోపణలు నమోదయ్యాయి. అయితే.. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. తమను విడిచిపెట్టాలని కోరారు. అయినప్పటికి వారిపై అత్యాచార.. హత్య చేసిన నేరాన్ని మోపారు.

వారెంత మొత్తుకున్నా వారి గోడును విన్నోళ్లు లేరు. విచారణ జరిపిన కోర్టు వారికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో.. వారిద్దరు జైలుకే పరిమితమయ్యారు. ఈ కేసుకు సంబంధించి అనుకోని మలుపు 2014లో చోటు చేసుకుంది. ఈ సోదరుల ఇద్దరి డీఎన్ఏ మ్యాచ్ కాకపోవటంతో.. బాలికను రేప్ చేసి చంపింది వీరు కాదని తేలింది. ఇదిలా ఉండగా.. తమకు జరిగిన అన్యాయంపై వారు గళం విప్పారు. తాము తప్పు చేయకున్నా.. ఇంతకాలం శిక్ష అనుభవించామని.. విచారణ పేరుతో సుదీర్ఘకాలం శారీరక హింసకు గురైనట్లు పేర్కొన్నారు.

నార్త్ కరోలినా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ ఇద్దరు సోదరులకు జరిగిన అన్యాయంపై సానుకూలంగా స్పందించింది. చేయని నేరానికి మూడు దశాబ్దాలకు పైనే జైలుశిక్ష అనుభవించినదానికి ఈ ఇద్దరు సోదరులకు రూ.550 కోట్ల పరిహారం మొత్తంగా ఇవ్వాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు పెను సంచలనంగా మారింది.