కరోనా కల్లోలం.. కొన్ని పాజిటివ్ వార్తలు


కరోనా కథ ముగిసిందని.. ఇక వైరస్ భయం లేదని రెండు నెలల ముందు చాలా ధీమాగా ఉన్నారు జనాలు. కానీ ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ చూస్తుండగానే ఉద్ధృత స్థాయికి చేరుకుంది. తొలి దశను మించి వైరస్ కల్లోలం రేపడం మొదలుపెట్టింది. గత నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నో విషాదాలు చూశాం. ఒక దశలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలు చూశాం. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ అందక, అత్యవసర మందులు దొరక్క వందలు వేలమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అంతకంతకూ తీవ్రత పెరుగుతుండటంతో జనాలకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.

బాగా తెలిసిన వాళ్లు, ఆరోగ్యంగా కనిపించిన వాళ్లు ఉన్నట్లుండి చనిపోయారన్న వార్తలతో జనాలు తల్లడిల్లిపోయారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయి.. ఆయా కుటుంబాలు అతలాకుతలం అయిన పరిస్థితులు చూశాం. ఇంకా ఇలాంటి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని భయపడిపోయాం.

ఐతే గత వారం రోజుల్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి. కరోనా కాస్త కనికరం చూపుతోంది. వైరస్ ప్రభావం తగ్గుతోంది. వారం కిందట ఒక దశలో దేశంలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షల 26 వేలకు చేరుకున్నాయి. కానీ అక్కడి నుంచి కేసులు తగ్గడం మొదలయ్యాయి. ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు అటు ఇటుగా ఉంటోంది. మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఆరోగ్యం విషమిస్తున్న వారి సంఖ్యా తగ్గుముఖం పట్టింది. ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం విజ్ఞప్తులు తగ్గాయి. ఇప్పుడు బెడ్స్ కోసం మరీ కష్టపడాల్సిన పని లేదు.

ఆసుపత్రుల్లో బెడ్స్ పెరగడం.. అదే సమయంలో పరిస్థితి విషమిస్తున్న వారి సంఖ్య తగ్గడం శుభసూచకమే. ఆక్సిజన్ నిల్వలు కూడా పెరిగాయి. సరఫరా బాగానే ఉంటోంది. మరోవైపు వ్యాక్సిన్ కొరత తగ్గించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రాలకు 60 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ నిల్వలు పెరగబోతున్నాయి. లాక్ డౌన్ కూడా ఫలితాన్నిస్తూ వైరస్ ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. మొత్తానికి జనాలు ఉపశమనం పొందే రోజులు త్వరలోనే వస్తున్నట్లు కనిపిస్తోంది.