తాజాగా భారత్ బయోటెక్, సీరమ్ ఫార్మా కంపెనీల యాజమాన్యాలు కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల ప్రకారం ఇదే అనుమానం వస్తోంది. జూన్-సెప్టెంబర్ మాసాలకు రెండు కంపెనీల్లో ఏది ఎన్ని డోసులను ఉత్పత్తి చేస్తుందో చెప్పాలని పై రెండు కంపెనీలను కేంద్రం కోరింది. కేంద్రం ప్రశ్నకు ఫార్మా కంపెనీల యాజామాన్యాలు ఉత్పత్తి అంచనాలను వివరించాయి.
ఆగస్టుకి నెలకు 7.82 కోట్ల డోసులకు ఉత్పత్తిని పెంచుతామంటు భారత్ బయోటెక్ (కోవ్యాగ్జిన్) చెప్పింది. అలాగే ఆగస్టునాటికి నెలకు 10 కోట్ల డోసులకు కోవీషీల్డ్ ఉత్పత్తిని పెంచుతామంటు సీరమ్ కంపెనీ కేంద్రానికి మాటిచ్చింది. జూలైలో 3.32 కోట్ల డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్లు భారత్ బయోటెక్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే జూన్ నెలలో ఎన్ని కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.
ఆగస్టులో 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్లే సెప్టెంబర్ మాసంలో కూడా అంతేమొత్తాన్ని ఉత్పత్తి చేస్తామని సీరమ్ కంపెనీ చెప్పింది. రెండు కంపెనీలు తాజాగా కేంద్రానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే మరికొద్ది నెలలపాటు దేశంలో టీకాల కొరత తప్పేట్లు లేదని అర్ధమైపోతోంది. డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచుకునే సామర్ధ్యం రెండు ఫార్మా కంపెనీలకు లేకపోవటం, టీకాల తయారీలో అతిముఖ్యమైన ముడిసరుకు విదేశాల నుండి రావాల్సి రావటంతో టీకాల ఉత్పత్తిలో బాగా ఆలస్యమైపోతోంది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే టీకాల తయారీలో మరిన్ని కంపెనీలకు అనుమతులు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో భారత్ బయోటక్ తయారుచేస్తున్న కోవ్యాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకుంటే ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి సూచించారు. విదేశీ కంపెనీలకైనా అనుమతివ్వాలి లేదా ఫార్ములాను ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకుని ఉత్పత్తి పెంచే ఏర్పాట్లన్నా చేస్తేనే కానీ ఇప్పిడిప్పుడే అందరికీ టీకాలు సాధ్యంకాదు.