ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తున్న సమయంలో రష్యా శాస్త్రవేత్తలు గొప్ప శుభవార్త చెప్పారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ల రూపకల్పన జరిగిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్, స్పుత్నిక్, ఫైజర్ బయోఎన్ టెక్.. ఇలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వీటిని రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్‌లో రెండు డోసులు తప్పనిసరి. పైగా సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం కూడా ఉందని వ్యాక్సిన్ తీసుకునేవారు ఆవేదన చెందుతున్నారు. దీంతో తొలి నాళ్లలో దీనిపై పెద్దగా ఆసక్తి కూడా లేకుండా పోయింది.
అయితే.. దేశంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో దేహంలో యాంటీబాడీలను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇక, రెండు డోసులు తీసుకోవాల్సి ఉండడం తో.. దేశంలో వ్యాక్సిన్ కొరత కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమస్యలు.. కరోనా తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న రష్యా.. సరికొత్తగా మరో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఒక్క డోసుతో సరిపోతుందని.. మంచి ఫలితం కూడా వస్తోందని.. అంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు.
రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సరికొత్త టీకాను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ లైట్
పేరుతో తయారు చేసిన ఈ టీకా ఒక్క డోసుతోనే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని ప్రకటించింది. రెండు డోసులు అవసరం లేనందున… వ్యాక్సినేషన్ రేటు రెండింతలు అవుతుందని వివరించింది.
స్పుత్నిక్ లైట్ విశేషాలు..
- కరోనా నుంచి రక్షణలో 79.4శాతం సమర్థత.
- టీకా తీసుకున్న 28వ రోజునే 91.7% మందిలో యాంటీబాడీలు అభివృద్ధి.
- 100 శాతం మందిలో కరోనా ఎస్-ప్రొటీన్‌ను ఎదుర్కొనే శక్తి అభివృద్ధి.
- రోగ నిరోధక శక్తి ఉన్నవారిలో టీకా తీసుకున్న 10 రోజులకే 40 రెట్లు పెరిగిన యాంటీబాడీల స్థాయి.