మొదట్లో డెక్కన్ ఛార్జర్స్.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ రెండు ఫ్రాంఛైజీలు కూడా స్థానిక అభిమానులను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. అసలు డెక్కన్ ఛార్జర్స్ తన ఫ్రాంఛైజీ పేరులో ‘హైదరాబాద్’ పదానికే చోటివ్వలేదు. అది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొన్నేళ్లకే అంతర్ధానం అయిపోయింది. ఆ తర్వాత దాని స్థానంలోకి సన్‌రైజర్స్ వచ్చింది. ఈ ఫ్రాంఛైజీకి సైతం కొన్నేళ్ల పాటు లోకల్ సపోర్ట్ అంతంతమాత్రమే.
ఆట పరంగా కానీ.. మరో రకంగా కానీ స్థానిక అభిమానులను ఆకర్షించడంలో సన్‌రైజర్స్ ఆరంభ దశలో విఫలమైంది. కానీ తర్వాత నెమ్మదిగా ఆ జట్టుకు ఫాలోయింగ్ పెరిగింది. వార్నర్, విలియమ్సన్, భువనేశ్వర్, రషీద్ ఖాన్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టుకు ఆకర్షణ తీసుకొచ్చారు. సన్‌రైజర్స్ ఆట కూడా మెరుగుపడింది. మంచి ప్రదర్శనకు తోడు అభిమానులతో కనెక్ట్ అయ్యే దిశగా కొన్ని చర్యలు చేపట్టడం కలిసొచ్చింది. 2016లో కప్పు కొట్టడం సన్‌రైజర్స్‌కు పెద్ద ప్లస్ అయింది. అప్పట్నుంచి అభిమానులు బాగానే ఓన్ చేసుకుంటున్నారు జట్టును.
ప్రతిసారీ ఐపీఎల్ వస్తే లోకల్ ఫ్యాన్స్ #orangeornothing అనే నినాదంతో ఊగిపోతుంటారు. ఈ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు జట్టు కష్ట కాలంలో ఉండగా.. #orangeisnothing అనే హ్యాష్ ట్యాగ్‌ను అభిమానులు ట్రెండ్ చేస్తుండటం గమనార్హం. కేవలం ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేయడం మాత్రమే సన్‌రైజర్స్ పట్ల ఈ వ్యతిరేకతకు కారణం కాదు. తాము ఎంతో ఇష్టపడే వార్నర్‌ను పక్కన పెట్టడం అభిమానులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తోంది.
కెప్టెన్సీ నుంచి తప్పించి, తుది జట్టు నుంచి కూడా పక్కన పెట్టి.. ఒక జూనియర్ ఆటగాడిలాగా అతడితో హెల్మెట్ మోయించడం అభిమానులకు ఎంతమాత్రం రుచించడం లేదు. చెత్తగా ఆడుతున్న విజయ్ శంకర్‌ను జట్టులో కొనసాగిస్తూ వార్నర్ మీద వేటు వేయడంలో ఆంతర్యమేంటో వారికి అర్థం కావడం లేదు. వార్నర్‌ను తప్పించిన మ్యాచ్‌లో మరింత చెత్తగా ఆడి చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్. కొత్త కెప్టెన్ విలియమ్సన్ తేలిపోయాడు. వార్నర్ బదులు ఆడిన నబి తుస్సుమనిపించాడు. ఈ నేపథ్యంలో #orangeisnothing హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ జట్టు యాజమాన్యాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు ఫ్యాన్స్. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ దారులు మూసుకుపోయినట్లే. అంతకంటే మించి అభిమానుల ఆదరణ కోల్పోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ లాగే ఉంది.