ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా పెరిగిపోయాయి. బాగా డబ్బున్న వాళ్లయితే పదుల కోట్లు పెట్టి కూడా లగ్జరీ విల్లాలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో రూ.50 కోట్లకు పైగా రేటు ఉన్న విల్లాలు కూడా ఉన్నాయి.
గత కొన్నేళ్లలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పటికీ.. ఈ లగ్జరీ విల్లాలు కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. ఐతే రూ.50-60 కోట్ల విల్లా అంటేనే వామ్మో వాయ్యో అనుకుంటాం.. అలాంటిది భాగ్యనగరంలో వంద కోట్ల రేటుతో విల్లాలు రాబోతున్నాయట.
ఆదిత్య రిజర్వ్ విల్లాస్ సంస్థ గండిపేటలో ఈ లగ్జరీ విల్లా ప్రాజెక్టును మొదలుపెడుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇప్పటికే రూ.40-60 కోట్ల మధ్య రేటుతో విల్లాలు అమ్ముతోంది. ఈ సంస్థ ఇంతకుముందు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 1000 చదరపు గజాల విస్తీర్ణంతో రూ.50 కోట్ల రేటుతో లగ్జరీ విల్లాలను ప్లాన్ చేసింది. కానీ ఆ ప్రాజెక్టును తర్వాత రాఘవ నోవా పేరుతో లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్‌గా మార్చారు.
కానీ ఇప్పుడు ఒక్కో ఫ్లాట్ అర ఎకరం విస్తీర్ణంతో భారీ లగ్జరీ ఫ్లాట్స్‌ను నిర్మించబోతోందట. వీటికి రూ.100 కోట్ల చొప్పున రేటు పెట్టనున్నారట. రాఘవ నోవా ప్రాజెక్టును నిర్మించిన మేకపాటి వారి స్థలంలోనే ఫేజ్-2గా ఈ వంద కోట్ల లగ్జరీ ఫ్లాట్స్‌ను నిర్మించనున్నారట.
ఐతే హైదరాబాద్‌లో మరీ వంద కోట్ల విల్లా అంటే ఊహకు కూడా అందని విషయం. బడాబాబులైనా సరే.. ఇంత రేటు పెట్టి విల్లా కొంటారా అన్నది సందేహం. ఐతే బయ్యర్స్ నుంచి వచ్చే స్పందనను బట్టే ఈ ప్రాజెక్టు ముందుకు కదులుతుందన్నది స్పష్టం. మరి రెస్పాన్స్ బాగుండి నిజంగానే వంద కోట్ల విల్లా ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందేమో చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates