ఓవైపు కరోనా ఆందోళన.. మరోవైపు వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు. ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. దేన్నిపట్టించుకోకుండా ప్రభుత్వం చెప్పే మాటను నమ్మేటోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు భిన్నంగా ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే వారికి మాత్రం తిప్పలు తప్పువు. అదే సమయంలో.. ప్రభుత్వం చెప్పేదానికి.. తమ కళ్ల ముందు కనిపించే అంశాల్ని లింకు వేసుకునే వారికి వచ్చే సందేహాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ ప్రపంచంలో చాలానే వీడియోలు.. మరెన్నో సంగతులు చాలానే కన్ఫ్యూజన్ కు గురి చేస్తుంటాయి. ఇలాంటివేళ.. నిజం ఏమిటన్నది తేల్చటం చాలా కష్టంగా మారింది.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ప్రభుత్వం విడుదల చేసే గణాంకాల్ని ప్రాతిపదికగా తీసుకోవటానికి మించిన ఉత్తమమైన పని మరొకటి ఉండదు. ఆ డేటాను విశ్వాసంలోకి తీసుకోవటం.. మన చుట్టూ ఉన్న పరిస్థితులతో మదింపు చేస్తే విషయాల పట్ల మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఐసీఎంఆర్ ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా సెకండ్ వేవ్ లో కేసుల తీవ్రత పెరిగిపోతున్న వేళ.. దానికి అడ్డుకట్ట వేసేందుకు టీకాలు వేసుకోవటం ఒక పరిష్కారంగా మారింది.
అయితే.. ప్రజల్లో నెలకొన్న సందేహాలతో టీకాలు వేయించుకునేందుకు అంతగా ఆసక్తి చూపించటం లేదు. ఆ మాటకు వస్తే.. సెకండ్ వేవ్ తీవ్రత కళ్ల ముందు కనిపిస్తున్న వేళ.. టీకా మీద ఆసక్తి ఎక్కువ కావటంతో.. టీకాను వేయించుకోవాలన్న అత్రత ఎక్కువైంది. ఈ కారణంతోనే టీకాలు వేసే దగ్గర కనిపించని భారీ క్యూలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
ఇంతకీ టీకా వేసుకున్న వారిలో కరోనా పాజిటివ్ ఎంతమందికి వచ్చింది? అన్న ఆసక్తికర లెక్కను బయటకు వెల్లడించింది. దీనికి సంబంధించిన గణాంకాల్ని విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న రెండు వ్యాక్సిన్లలో ఏదో ఒకదానిని తీసుకున్న తర్వాత ఎంత మందికి వైరస్ సోకిందన్న లెక్కను వెల్లడించారు. ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం టీకా తీసుకున్న తర్వాత పాజిటివ్ గా తేలిన వారు తక్కువ మందేనని తేలింది. అంతేకాదు.. టీకా తీసుకున్న తర్వాత కోవిడ్ బారిన పడినప్పటికి వారిలో తీవ్రత తక్కువగా ఉందన్న విషయం వెల్లడైంది.
టీకా తీసుకున్న తర్వాత ప్రతి పదివేల మందిలో నలుగురికే పాజిటివ్ గా తేలినట్లుగా వెల్లడించారు. టీకా తీసుకున్న వారిలో మొత్తంగా 0.03 శాతం మందే పాజిటివ్ గా తేలినట్లుగా చెప్పారు. టీకా వేసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ అయిన వారిలో ఎక్కువ మంది.. వైద్య సిబ్బంది.. ఫ్రంట్ లైన్ వర్కర్లే ఎక్కువగా ఇన్ ఫెక్షన్ కు గురైనట్లు తెలిపారు. ఈ లెక్కన వీరిని కూడా మినహాయిస్తే.. సాధారణ ప్రజల్లో టీకా వేయించుకున్న తర్వాత కోవిడ్ బారిన పడినోళ్లు అతి తక్కువగా ఉంటారని చెప్పక తప్పదు. ఇప్పటికైనా టీకా వేయించుకుంటే కోవిడ్ వస్తుందా? అన్న సందేహాం తీరిందా?