రాష్ట్రంలో రెడ్ అలర్ట్ తప్పదా ?

దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాగే ఏపిలో కూడా కరోనా వైరస్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతోంది. రోజుకు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. రికార్డుల ప్రకారం 35 మంది చనిపోయారు. ఏపికి నాలుగువైపులా తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఒడిస్సా రాష్ట్రాలున్నాయి. వీటిల్లో తమిళనాడు, కర్నాటక, తెలంగాణాలో ప్రతిరోజు వేలాదికేసులు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం ఏపిపైన కూడా పడుతోంది.

మొదటి దశలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపించినా రోజుకు 10 వేల కేసులు నమోదైతే కాలేదు. కానీ ఇపుడు సెకెండ్ వేవ్ లో మాత్రం రెట్టించిన స్పీడుతో వ్యాపించేస్తోంది. కేసులు పెరిగిపోతున్నంత స్పీడుగా టెస్టులు, ట్రాకింగ్, చికిత్స సాద్యంకాదన్న విషయం అందరికీ తెలిసిందే. దీని ఆధారంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. శ్రీకాకుళంలో అత్యధికంగా 1500 మంది, గుంటూరులో 1236, చిత్తూరులో 1180, కర్నూలులో 958, నెల్లూరులో 936 అనంతపురంలో 849, తూర్పుగోదావరిలో 830 కేసులు నమోదయ్యాయి.

పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రుల సంఖ్యను, పరీక్షలను పెంచటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కొన్నిచోట్ల అధికారుల్లో సమన్వయ లోపం కారణంగా ప్రభుత్వ ఆదేశాలు అనుకున్నంత వేగంగా అమలు కావటంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 60 వేలుదాటాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అయినా మనదగ్గర నమోదైన కేసులు ఎక్కువనే చెప్పాలి.

కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కూడా రోజుకు లక్షల్లో వ్యాక్సిన్లు వేయిస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్లు కూడా అవసరాలకు సరిపడా సరఫరా కాకపోవటంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి 2 లక్షల కోవీషీల్డ్ డోసులు వచ్చాయి. అయితే వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు లక్షల్లో ఎదురుచూస్తుండటంతో వచ్చిన డోసులు సరిపోవటంలేదు.

కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోమని ప్రభుత్వం మొత్తుకున్నా అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు సెకెండ్ వేవ్ కారణంగా పరీక్షల కోసం జనాలు ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ ని అరికట్టడంలో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో లాక్ డౌన్ మొదలైపోయాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే రెడ్ అలర్ట్ ప్రకటించక తప్పదేమో అనిపిస్తోంది.