సెకండ్ వేవ్: ఇలాంటి లక్షణాలు వస్తే.. అలెర్టు అవ్వాల్సిందే

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సెకండ్ వేవ్.. షాకుల మీద షాకులు ఇస్తోంది. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో పాజిటివ్ ల జోరు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. మొదటి వేవ్ లో కరోనా సోకిన వారికి కనిపించిన లక్షణాలకు.. సెకండ్ వేవ్ వేళ.. కనిపిస్తున్న లక్షణాల్లో కాస్తంత మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. నిత్యం కరోనా రోగులకు చికిత్స చేస్తున్న పలువురు వైద్య నిపుణులు.. తమ వద్దకు వస్తున్న కేసుల ఆధారంగా చేసుకొని కొన్ని లక్షణాల్ని చెబుతున్నారు.

ఇలాంటివి కానీ కనిపిస్తే.. కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని గుర్తించే వీలుందని.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీనికి కారణం.. కరోనాను ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత మంచిది. ఏ మాత్రం ఆలస్యం చేసినా.. శరీరంలోని పలు కీలక వ్యవస్థల్ని దెబ్బ తీసే దుర్మార్గపు లక్షణం దీని సొంతం. వైరస్ ఇంక్యుబేషన్ వ్యవధి మూడు రోజులే ఉండటం.. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించని వారి కారణంగా.. వారు కరోనా వాహకాలుగా మారుతున్నారు. ఈ సూపర్ స్పైడర్ల కారణంగా కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది.
ఇంతకీ.. సెకండ్ వేవ్ వేళ.. మారిన లక్షణాలు.. అప్రమత్తం కావాల్సిన అంశాల్లోకి వెళితే..

–  కొందరికి 3-4 రోజుల పాటు జ్వరం వచ్చి తగ్గి.. మళ్లీ వస్తోంది. ఇంకొందరిలో తీవ్రమైన నీరసం, దమ్ము, ఛాతీలో అసహజంగా ఉంటోంది.
–  పలువురిని తలనొప్పి, వెన్నునొప్పి, గొంతు నొప్పి బాధిస్తున్నాయి. కళ్లు ఎర్రబడటం, చర్మంపై మచ్చలు, నోటిలో పొక్కులు, ఆకలి లేకపోవడం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
–  జ్వరం మాత్రలు వేసుకున్నాక కూడా తగ్గకపోతే తక్షణమే వైద్యుణ్ని సంప్రదించాలి.
–  కళ్ల కలక మాదిరిగా కరోనా పాజిటివ్స్‌లో కళ్లు చాలా ఎర్రగా తయారవుతున్నాయి. ముందుగా చాలా మంది దీన్ని కంటి ఇన్ఫెక్షన్‌గా భావిస్తున్నారు. కళ్లలో విపరీతమైన నొప్పి, కళ్లు లాగినట్లు అనిపించడం వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. రెండు రోజుల పాటు కళ్లు ఎర్రగా ఉంటే కరోనా ఇన్ఫెక్షన్‌గా అనుమానించాలి.
–  కొందరిలో జ్వరం ఉండదు, దగ్గు అసలే ఉండదు. టెంపరేచర్‌ చెక్‌ చేస్తే 99డిగ్రీల సెల్సియస్‌ ఉంటోంది. వారికి కరోనా సోకినట్లే. పరీక్ష చేయించుకుంటే మంచిది.
–  ఇది వరకు కరోనా తీవ్రత ఎక్కువగా 50 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించేది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడం ఆ వయస్సు వారిలోనే చోటుచేసుకునేవి. ఇప్పుడు 25నుంచి40 ఏళ్ల లోపు వారిలోనూ ఇబ్బందులున్నాయి.
–  కరోనా పాజిటివ్స్‌ కొందరిలో గ్యాస్ట్రో ఎంటారాలజీ సమస్యలు.. 30లోపు వయస్సు వారిలో రెస్పిరేటర్‌, ఆక్సిజన్‌ సమస్యలు కనిపిస్తున్నాయి.
–  అనుమానిత లక్షణాలు కనిపిస్తే.. నిత్యం ఆక్సిజన్ లెవెల్స్ ను పరీక్షించుకోవాలి. 94 కంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. ఆసుపత్రిలో చేరటం మంచిది.