మాస్కు పెట్టుకోకుంటే రెండేళ్లు జైలు.. ఎక్కడంటే?

వినేందుకు విచిత్రంగా అనిపించినప్పటికి ఇది నిజం. మాస్కు పెట్టుకోకుండా బయటకు వెళ్లి.. పట్టుబడితే రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుంది. మాస్కు పెట్టుకోకుంటే జరిమానాలే విన్నాం కానీ.. ఈ జైలు మాటేమిటి? కొత్తగా అనుకుంటున్నారా? మాస్కుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి.

మాస్కు పెట్టుకోని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టే వీలుంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 51 నుంచి 60 ప్రకారమైతే ఏకంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే వీలుంది. అదే.. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తే ఆర్నెల్లు జైలుశిక్ష లేదంటే వెయ్యి వరకు జరిమానా విధించే వీలుంది. కొన్ని సందర్భాల్లో రెండూ శిక్షల్ని కలిపి వేసే వీలుంది.

తెలంగాణకు ఇరుగుపొరుగున్న రాష్ట్రాలతో పోలిస్తే.. అక్కడ విధించే శిక్షలతో పోలిస్తే.. తెలంగాణలోనే ఎక్కువ. ఏపీలో మాస్కుధరించని వారికి రూ.250 చొప్పున ఫైన్ వేస్తున్నారు. మహారాష్ట్రలో మాస్కు లేకుంటే రూ.వెయ్యి ఫైన్ వేస్తున్నారు. రెండోసారి అదే తప్పు చేసి పట్టుబడితే రూ.3వేలు.. మూడోసారి పట్టుబడితే రూ.5వేల ఫైన్ వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మాస్కు లేని వారికి రూ.500 ఫైన్ వేస్తున్నారు.

తెలంగాణలో ఫైన్ తో పాటు.. జైలుశిక్ష వేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. మాస్కు లేకుండా వెళ్లే వారిని గుర్తించేందుకు వీధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ద్వారా వ్యక్తుల్ని గుర్తించి ఫైన్లు..శిక్షలు విధించే వీలుంది. సో.. మాస్కు లేకుండా బయటకు వస్తే ఏమవుతుందని లైట్ తీసుకుంటే.. భారీ ఫైన్ మాత్రమే కాదు.. జైలుశిక్ష ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. బీ కేర్ ఫుల్.