టమాటా కోసం ఆ దేశం రెండుగా విడిపోయి కొట్టుకుంది

వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. చిన్న గొడవలే తర్వాతి దశల్లో పెద్దవిగా మారుతుంటాయి. మహాభారతాన్నే చూస్తే.. ఈగో అనే మాట లేకపోతే లక్షలాది మంది మరణాలకు కారణమైన యుద్ధమే లేదు. ఆ పురాణాన్ని పక్కన పెడితే.. గంపెడు టమాటా కోసం దేశం రెండు వర్గాలుగా చీలి పరస్పర దాడులతో అతలాకుతలం కావటాన్నిఊహించగలరా? సంచలనంగా మారిన ఈ ఘర్షణ ఎక్కడ జరిగాయన్నది చూస్తే..

ఆఫ్రికాలోని నైజీరియాలో టమోటా బుట్టల కారణంగా గొడవలు కావటమే కాదు.. చివరకు దేశం రెండుగా చీలిపోయిన పరిస్థితి. గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటాలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్ కు వెళుతున్నాడు. ప్రమాదం జరిగి టమాటాలు రోడ్డు మీద పడ్డాయి. దీంతో అక్కడి సమీపంలోని షాపుల వారికి ఇబ్బంది అయ్యింది. ఆ సందర్భంగా వారి మధ్య వాదనలకు కారణమైంది. అది కాస్తా తర్వాత ఘర్షణలకు దారి తీసి పోరాటాల వరకు వెళ్లింది.

ఈ ఉదంతానికి సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో మరో మలుపు తిరిగింది. దేశంలోని ఉత్తర ప్రాంతానికి చెందిన ముస్లింలు.. దక్షిణ ప్రాంతానికి చెందిన క్రైస్తవులుగా రెండు వర్గాలుగా విడిపోయింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో యావత్ దేశం హింసాత్మక ఘటనలుచోటు చేసుకున్నాయి. అనేక దుకాణాలపై దాడి చేశారు. వాటికి నిప్పు అంటించారు. ఇప్పటివరకు జరిగిన హింసకు 20 మంది వరకు చనిపోయారు. వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు. ప్రస్తుతం ఆ దేశంలో నిత్యవసర వస్తువులకు కొరత ఏర్పడింది. దీంతో.. ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలంటూ కఠిన ఆంక్షలు విధించింది. బుట్టెడు టమోటా ఎంత రచ్చ చేసిందో కదా!