గూగులమ్మే కదా అని అడిగిన సమాచారాన్ని చూసుకొని ఫోన్ చేస్తే అడ్డంగా బుక్ కావటమే కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ కావటం ఖాయం. రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అవగాహన లేనితనాన్ని.. నమ్మకాన్ని అదునుగా తీసుకొని దోచేసుకునే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి చేదు అనుభవం ఒకటి హైదరాబాద్ కు చెందిన ఒక మహిళకు ఎదురైంది.
ఎల్లారెడ్డిగూడకు చెందిన ఒక మహిళ అమెజాన్ లో ఒక వస్తువ ఆర్డర్ చేసింది. అయితే.. చేసిన వస్తువు రావటంలో ఆలస్యం కావటంతో.. ఊరుకోలేక అమెజాన్ కస్టమర్ కేర్ ఫోన్ నెంబరు కోసం గూగుల్ లో సెర్చి చేసింది. అందులో కనిపించిన ఒక నెంబరుకు రింగ్ చేసింది. తన ఆర్డర్ వివరాలు చెప్పి.. డెలివరీ ఎప్పుడు చేస్తారని అడిగింది. కాసేపట్లో సమాధానం చెబుతామని చెప్పి ఫోన్ పెట్టేశారు.
కాసేపటికి తనను తాను అమెజాన్ ప్రతినిధినని పరిచయం చేసుకున్న వ్యక్తి.. సదరు మహిళ చెప్పిన వివరాల్ని ట్రాక్ చేశామని.. వస్తువు స్టాక్ లేకపోవటంతో ఆలస్యమైందని చెప్పారు. ఆర్డర్ కేన్సిల్ చేసి ఆమె చెల్లించిన డబ్బును తిరిగి ఇస్తామని చెప్పారు. ఇందుకు సదరు మహిళ ఫోన్ కు ఒక క్యూఆర్ కోడ్ వస్తుందని.. దాన్ని క్లిక్ చేసి స్కాన్ చేస్తే డబ్బులు మహిళ అకౌంట్ కు ట్రాన్సఫర్ అవుతాయని చెప్పారు.
దీంతో.. అతడు చెప్పినట్లే క్యూఆర్ కోడ్ ను క్లిక్ చేసిన మహిళ బ్యాంక్ ఖాతా నుంచి రూ.3.10 లక్షల మొత్తం డెబిట్ అయ్యింది. దీంతో.. వెంటనే ఆ నెంబరుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అయ్యింది. మోసపోయినట్లు గ్రహించిన మహిళ.. సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. అందుబాటులో ఉంది కదా అని గూగులమ్మను మరీ నమ్మేస్తే.. నష్టపర్చేందుకు దొంగలు కొందరు కాచుకొని కూర్చుంటారన్నది మర్చిపోవద్దు.