దారుణం.. ఆమెపై 60 మంది అత్యాచారం

దారుణమైన ఘోరం బయటకు వచ్చింది. విన్నంతనే ఒళ్లు జలదరించే అమానవీయమైన వైనం తాజాగా వెలుగు చూసి సంచలనంగా మారింది. మగాళ్లు మృగాళ్లుగా మారిన.. ఒక అబలపై నెలరోజుల పాటు 60 మంది జరిపిన అత్యాచార ఉదంతం తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సరాయ్ కేలా – ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీపంలోని గ్యారేజ్ లో తనను బంధించినట్లుగా ఆమె పోలీసులకు చెప్పింది. బాధితురాలు తీవ్రమైన అనారోగ్యంతో ఉందని.. సరిగా మాట్లాడలేకపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తనను ఎప్పుడు కిడ్నాప్ చేసింది ఆమె చెప్పలేకపోతోంది.

బాత్రూంకు వెళ్లాలని చెప్పి.. మృగాళ్ల నుంచి తాను తప్పించుకున్నట్లుగా ఆమె చెబుతోంది. తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని.. మాట వినకుంటే తీవ్రంగా కొట్టేవారని.. దారుణమైన హింసకు గురి చేసేవారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. కేసును నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.