కొన్నేళ్ల క్రితం వరకు సహజీవనం అన్న మాటే అరుదుగా వినిపించేది. ఇప్పుడు కామన్ గా మారటమే కాదు.. దానికి పాజిటివ్ గా సీరియల్స్.. యాడ్స్.. షార్ట్ ఫిలింస్ ఇలా వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. లివింగ్ రిలేషన్ షిప్ అన్నది చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది. అయితే.. రిలేషన్ లో ఉన్నంతవరకు ఓకే కానీ.. తర్వాత ఏ మాత్రం తేడా వచ్చినా అందుకు భిన్నంగా వ్యవహరించే తీరు తరచూ కేసుల రూపంలో వార్తల్లోకి వస్తున్నారు.
ఇలాంటి కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.
సహజీవనంలో చేసే సెక్సు రేప్ కిందకు రాదని.. ఒకవేళ రిలేషన్ లో ఉన్న సందర్భంలో గాయపరిస్తే.. అది వేరే కేసు అవుతుందే తప్పించి.. రేప్ కేసు కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సహజీవనం చెడిన తర్వాత చోటు చేసుకునే పరిణామాలపై కోర్టు ఎలా చూస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఆ కేసు వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ కు చెందిన విజయ్ ప్రతాప్ సింగ్ ఒక మహిళతో రెండేళ్లు సహజీవనం చేశాడు. కానీ.. ఆ తర్వాత వీరి రిలేషన్ బ్రేక్ అయ్యింది. అతగాడు మరో అమ్మాయిని పెళ్లాడాడు. దీనిపై సహజీవనం చేసిన మహిళ కోర్టుకు ఎక్కింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడంటూ 2019లో కంప్లైంట్ ఇచ్చింది. తనను రెండేళ్ల పాటు అత్యాచారం చేసినట్లుగా ఆమె ఆరోపించారు. ఆమెకంప్లైంట్ ను ఎఫ్ఐఆర్ చేసిన పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వినయ్ కోర్టులో సవాలు విసిరారు.
చివరకు ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వచ్చింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఆయన కోరుతున్నాడు.
ఎందుకంటే.. తాను సదరు అమ్మాయి అంగీకారంతోనే సహజీవనం చేశామని.. ఆ సందర్భంగా శృంగారంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. ఆమె కూడా వేరే వారితో సహజీవనం చేసిందని వినయ్ తరఫు లాయర్ పేర్కొన్నారు. దీనికి మహిళ తరఫు లాయర్ కౌంటర్ ఇస్తూ.. 2014 నుంచి నిందితుడు తన క్లయింట్ తో మోసపూరిత బంధాన్ని కొనసాగించాడని.. మనాలిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు చెప్పారు.
దీన్ని వినయ్ ఖండిస్తూ.. తాను పెళ్లి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. ఇరు వర్గాల వాదన విన్న అనంతరం సుప్రీం సీజేఐ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. పెళ్లి గురించి తప్పుడు ప్రామిస్ లు చేయటం మోసమే అవుతుందన్నారు. ఈ విషయంలో పురుషుడు.. మహిళా ఎవరు వాగ్ధాన భంగం చేసినా మోసమే అవుతుందన్నారు. కానీ.. ఒక మహిళ.. పురుషుడు ఇష్టంతో సహజీవనం చేస్తే.. ఆ సమయంలో ఎంత అతడు ఎంత క్రూరంగా ఉన్నా.. ఎన్ని తప్పులు చేసినా దాన్ని అత్యాచారంగా పరిగణించలేమన్నారు.
ఈ కేసు విచారణలో వినయ్ ప్రతాప్ తనను దారుణంగా హింసించటంతో పాటు.. గాయపరిచాడని.. తాను ఆసుపత్రి పాలైనట్లుగా ఫిర్యాదు చేసిన మహిళ పేర్కొంది. ఈ సందర్భంలో కాలు విరిగినట్లు కూడా చెప్పింది. దీనికి స్పందించిన కోర్టు.. ఒకవేళ అలా జరిగి ఉంటే.. దాడికి సంబంధించిన కేసు పెట్టాలే కానీ అత్యాచారం కేసు ఎలా పెడతారని ప్రశ్నించింది. ఈ కేసులో వినయ్ ను ఎనిమిది నెలల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ట్రయల్ కోర్టులో పిటిషనర్ సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.