మూడు బ్యాంకుల ముచ్చ‌ట‌.. అమ్మ‌కానికి రెడీ!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఇటీవ‌ల కాలంలో బ్యాంకుల‌ను విలీనం చేయ‌డం లేదా.. అమ్మేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను వ‌డివ‌డిగా చేప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల యూనియ‌న్ బ్యాంకులోకి ఆంధ్రాబ్యాంకుతో పాటు.. కార్పొరేష‌న్ బ్యాంకును విలీనం చేసిన విష‌యం తెలిసింది. ఇక‌, ఇప్పుడు.. మ‌రో మూడు బ్యాంకుల‌ను అందునా.. ప్ర‌ముఖ బ్యాంకుల‌ను అమ్మ‌కానికి రెడీ చేయ‌డం సంచల‌నంగా మారింది. ప్రైవేటీకరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రాథమికంగా నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. వీటిలో ఒక దానిని మిన‌హాయించే అవ‌కాశం ఉంది. దీంతో ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు బ్యాంకుల‌ను మాత్రం ఖ‌చ్చితంగా విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌, ఉద్యోగుల సంఖ్య‌ను బ‌ట్టి అమ్ముతామ‌ని అంటున్నా.. నిర‌ర్ధ‌క ఆస్తులు పేరుకుపోయిన‌.. బ్యాంకుల‌ను విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 50 వేలు. సెంట్రల్ బ్యాంకులో 33 వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై మరింత లోతుగా అధ్యయనం చేసి, ఈ నాలుగింటి లోంచి ఏదైనా రెండు లేదా మూడు బ్యాంకులను కేంద్రం ఎంచుకుని అమ్మకానికి పెట్టనుంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఐదు లేదా ఆరు నెలల పట్టవచ్చనేది అంచనా. ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ పారిశ్రామిక సంస్థ‌ల‌ను అమ్మ‌కానికి పెట్టిన మోడీ.. ఇప్పుడు బ్యాంకుల‌ను కూడా టోకున అమ్మేయ‌నున్నార‌న్న వార్త చ‌ర్చ‌కు దారితీసింది.