భార్యను చంపేసి.. డయల్ 100కు ఫోన్.. పోలీసుల కోసం వెయిట్ చేశాడు

భార్యల్ని భర్తలు.. భర్తల్ని భార్యల్ని చంపేయటం ఈ మధ్యన ఎక్కువైంది. జీవితాంతం తోడు ఉంటామన్న బాసలు ఇప్పుడు ఎవరూ పట్టించుకోని పరిస్థితి. క్షణిక ఆవేశం.. అంతకు మించిన అనుమానం పెనుభూతంలా మారుతోంది. కాపురాల్ని కాటికి తీసుకెళుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఈ కోవకు చెందినిదే. ఆరోగ్యం సరిగా లేని భార్యను ఆసుపత్రికి తీసుకెళుతున్నట్లుగా చెప్పి.. దారి మధ్యలో దారుణంగా చంపేసి.. డయల్ 100కు ఫోన్ చేసి మరీ తాను చేసిన ఆరాచకాన్ని చెప్పి లొంగిపోవటం గమనార్హం.

మహబూబాబాద్ జిల్లాలోని పెనుగొండకు చెందిన నరేశ్ కు చిన్నగూడురు మండలంలోని బయ్యారానికి చెందిన సరితతో పన్నెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. నరేశ్ డీసీఎం డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతడికి సరిత రెండో భార్య. ఇటీవల ఆమెపై అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో.. తరచూ వారిద్దరి మధ్య గొడవలు అయ్యేవి. ఇదిలా ఉండగా.. ఇలాంటి చెత్త అనుమానాన్ని పెట్టుకొని ఆమెను చితకబాదేశాడు. దీంతో.. సరిత తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలిసిన సరిత తల్లి వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లింది.

ఈ క్రమంలో సోమవారం అత్తారింటికి వెళ్లిన నరేశ్.. వారికి సర్దిచెప్పి.. మంచి ఆసుపత్రికి తీసుకెళుతున్నట్లుగా చెప్పి.. ఆమెను.. చిన్న కమార్తెను వెంట పెట్టుకొని బయలుదేశాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నామాలపాడు అటవీ ప్రాంతానికి తీసుకొచ్చాడు. తనతో తెచ్చుకున్న కత్తితో సరితను పొడిచేశాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. ఆపై డయల్ 100కు ఫోన్ చేసి భార్యను హత్య చేసినట్లుగా సమాచారం ఇచ్చాడు.

పోలీసులు వచ్చే లోపు అక్కడి స్థానికులు వచ్చారు. ఏం జరిగిందన్న వారి ప్రశ్నకు నరేశ్ బదులిస్తూ.. తన భార్యను తాను చంపేసానని.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పానని.. వారొచ్చే వరకు తాను అక్కడే ఉంటానని చెప్పిన వైనం విస్మయానికి గురి చేసింది. తన భార్య చచ్చిపోయిందని.. ఇక తాను దేనికైనా సిద్ధమేనని.. ఉరి వేసినా అనుభవిస్తానని చెబుతున్న తీరు చూస్తే. అతగాడి ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని చెప్పక తప్పదు.